బాబ్లీకేసు: చంద్రబాబుకు చుక్కెదురు

Dharmabad Court Rejects Chandrababu Recall Petition - Sakshi

ధర్మాబాద్‌(మహారాష్ట్ర) : బాబ్లీకేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్‌ పిటిషన్‌ను ధర్మాబాద్‌ న్యాయస్థానం తిరస్కరించింది. అదే సమయంలో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో చంద్రబాబుతో సహా మరో 19 మందికి ధర్మాబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారిలో తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్‌, కేఎస్‌ రత్నం, ప్రకాశ్ గౌడ్‌లు నేడు కోర్టుకు హాజరయ్యారు. అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు.

ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు. అంతేకాకుండా నాలుగు వారాల గడువు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాము ఎవరికీ స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అయిన కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. కోర్టుకు హాజరైన గంగుల కమలాకర్‌, కేఎస్‌ రత్నం, ప్రకాశ్‌ గౌడ్‌లకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది. నోటీసులు అందుకున్న మిగిలిన 16మంది(చంద్రబాబుతో పాటు) ఆ రోజున కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top