వర్మను నమ్మడం మాఖర్మ..!

Dhanalaxmi Krishna Rao Slams SVSN Varma East Godavari - Sakshi

నమ్మినందుకు నట్టేటముంచారు..!

బతిమాలుకుంటే బరిలోకి దిగి మెజార్టీ అందించా

అవసరం తీరాక పొగపెడుతున్నారు

తూర్పుగోదావరి, పిఠాపురం: మాపార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడడానికి అభ్యర్థులు లేరని ఎన్నికల్లో నిలబడి తమ పరువు నిలబెట్టాలని బతిమలాడితే రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ఆయన మాటలు నమ్మి ఎన్నికల్లో నిలబడి మెజార్టీ సాధించి పెడితే అవసరం తీరాకా అవతలికి తగిలేస్తున్నారని ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తీరుపై  పిఠాపురం మండలం భోగాపురం ఎంపీటీసీ (టీడీపీ) అల్లుమల్లు ధనలక్ష్మి కృష్ణారావు మండిపడ్డారు. కొన్ని నెలలుగా తమను పక్కన పెట్టి ఇతర నాయకులు అధికారులతో అభివృద్ధి పనులు చేయిస్తూ తమను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె ఎమ్మెల్యే వర్మ తీరుకు నిరసనగా తన ఎంపీటీసీ పదవితో పాటు తెలుగదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను తనకు సంబంధం లేకుండా ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా అధికారులతో చేయిస్తున్నారన్నారు.

తాను సిఫార్సు చేసిన వారికి కాపు కార్పొరేషన్‌ రుణాల రాకుండా తీయించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఒక నియంతగా పని చేస్తున్న ఎమ్మెల్యే వర్మ ప్రజల చేత ఎన్నుకోబడిన తనను ఒక మహిళను అనే విజ్ఞత కూడా లేకుండా పక్కన పెట్టారన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకునే ఎమ్మెల్యే వర్మ టీడీపీకి కష్టకాలంలో నిలబడి ఒక ఎంపీటీసీ పదవిని తెచ్చిపెట్టిన తనను అవమానిస్తు ఆడబడుచులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. చివరకు గ్రామదర్శిని కార్యక్రమానికి సైతం తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించిన ఎమ్మెల్యే వర్మను నమ్మడం నిజంగా తమ ఖర్మేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఉన్న తనను అణగదొక్కడానికి కొంత కాలంగా ఇతర నాయకులకు ప్రాముఖ్యత కల్పిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా పార్టీపై ఉన్న నమ్మకం అభిమానం ప్రజలు తనకు ఇచ్చిన పదవిని వమ్ము చేయకూడదన్న ఒకే ఒక్క పట్టుదలతో ఇన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఆమె తెలిపారు. అయితే గెలిపించిన ప్రజలు నాకు జరుగుతున్న అవమానాలను చూసి చలించి పోతున్నారని, పనుల గురించి ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఇక ఎమ్మెల్యే ఇతర నాయకులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక రాజీనామా చేస్తున్నానని నమ్మించి నట్టేటముంచిన వర్మ ఓటమిని చూడడమే ధ్యేయంగా తాను పని చేస్తానని ఇలాంటి నమ్మక ద్రోహం మరే ఆడబడుచుకు జరగకుండా పోరాడతానని ఆమె తెలిపారు.

ఎమ్మెల్యే వర్మ దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు ర్యాలీ
కాకినాడ సిటీ: పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ వర్మ ప్రభుత్వ ఉద్యోగులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ మంగళవారం పిఠాపురం పురవీధుల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్‌జీఓ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం తెలిపారు. కాకినాడలో జిల్లా ఎన్‌జీఓ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గొల్లప్రోలులో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న శివ లక్ష్మిని అవమానకరంగా తిట్టడమే కాకుండా మహిళ అని చూడకుండా ఆమెతో మురికి కాలవలోని పూడిక తీయించిన విధానాన్ని జిల్లా ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎమ్మెల్యే వర్మ చర్యలను నిరసిస్తూ పిఠాపురం పురవీధుల్లో చేపట్టనున్న నిరసన ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తరలిరావాలని ఆశీర్వాదం పిలుపునిచ్చారు. ఏపీఎన్‌జీఓ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జియాఉద్దీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, నాయకులు వై.శ్రీనివాస్, నరసింహం, నాలుగో తరగతి ఉద్యోగ ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు వైఎన్‌ సత్యనారాయణమూర్తి, వీఆర్వోల సంఘ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, నీలపాల వీరబాబు, నాగేశ్వరరావు, మూర్తిబాబు, కృష్ణ, నారాయణ, రామాంజనేయులు, అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
బిక్కవోలు (అనపర్తి): బిక్కవోలు గ్రామ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు సోమవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సమక్షంలోనే వ్యతిరేక వర్గాలు రెండు తీవ్ర పదజాలంతో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుని దాడులకు తెగబడే యత్నం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన నాయకులు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తున్నామంటు ప్రకటించి మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మబలికి ఆధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను విస్మరించి అసలు ప్రజలకు సంబంధం లేకుండా నామినేటెడ్‌ పదవిలో ఉన్న ఊలపల్లికి చెందిన సురేష్‌రెడ్డికి బిక్కవోలు గ్రామం పై పెత్తనం అప్పగించడమేమిటంటు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడమే కాకుండా ఆస్తులు అమ్ముకున్నామని, అయినా తమను పక్కన పెట్టి తీవ్ర అన్యాయం చేశారని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు గ్రామ పెత్తనాన్ని అప్పగించడం పై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలకు విలేకర్ల సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నాయకులు సాయంత్రానికి ఎమ్మెల్యే నుంచి పిలుపు రావడంతో శాంతించారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే రచ్చకెక్కిన విభేదాల నేపథ్యంలో పార్టీపై వారి విధేయత ఏ మేరకు ఉంటుందో, ఎమ్మెల్యే విశ్వాసాన్ని పొందడం సాధ్యమేనా అనే విషయం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top