కుళ్లిన కోడిగుడ్లే వడ్డించారు

DEO Inquiry on Midday meal Scheme Visakhapatnam - Sakshi

డీఈవో విచారణలో తేటతెల్లం

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం

ఆహార నాణ్యతలో అలసత్వం వద్దు

జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి

నర్సీపట్నం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. నర్సీపట్నం బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ నెల 29న విద్యార్థినులకు కుళ్లిన కోడిగుడ్లు పెట్టారని అందిన ఫిర్యాదు మేరకు బుధవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ముందుగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఉపాధ్యాయుల్ని ప్రశ్నించారు. విద్యార్థినులను సైతం విచారించారు. విద్యార్థులకు వడ్డించేందుకు తయారు చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు నాణ్యమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు వడ్డించడం లేదనే విషయం రుజువైందని చెప్పారు. ఉడికించేందుకు నీటిలో వేసిన గుడ్లలో పాడైనవి పైకి తేలాయని.. వాటిని తాను స్వయంగా తీయించానని డీఈవో చెప్పారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం కారణంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇష్టానుసారంగా ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారన్నారు. హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తానని చెప్పారు. వారి నుంచి సరైన సమాధానం రాకుంటే వంట నిర్వాహకులను తప్పించడంతో పాటు హెచ్‌ఎం, ఆ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిల్వల్లో తేడాలున్నాయ్‌...
నిత్యావసర సరుకులకు సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్‌లో వెత్యాసం ఉందని డీఈవో గుర్తించారు. 1346 కిలోలకు గాను 250 కిలోల బియ్యం మాత్రమే స్టోర్‌ రూమ్‌లో ఉన్నాయన్నారు. దీనిపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే గుడ్డును విద్యార్థులకు వలిచి ఇవ్వాలని సూచించారు.
నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌ చేస్తానని డీఈఓ హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ పార్టీ «అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, సిరసపల్లి నాని, యాదగిరి శేషు, లోకవరపు శ్రీను, చోటీ, రాజేశ్వరి, పాకలపాటి అరవిందుకుమార్‌లు పాఠశాలలో జరుగుతున్న విషయాలను డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top