ఫుల్లుగా సీట్లు భర్తీకి ఎడతెగని పాట్లు | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా సీట్లు భర్తీకి ఎడతెగని పాట్లు

Published Tue, Nov 5 2019 5:08 AM

Decreased interest in DED and BED courses - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో చేరికల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఒకప్పుడు డీఎడ్, బీఎడ్‌ కాలేజీల్లో సీట్ల కోసం వేలాది మంది నిరీక్షించేవారు. ఇప్పుడు విద్యార్థుల కోసం కాలేజీలు నిరీక్షిస్తున్నాయి. డిమాండ్‌కు మించి కాలేజీలకు అనుమతులు ఇవ్వడం, సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వొద్దని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్‌సీటీఈ) లేఖలు రాసింది. అయినా ఎన్‌సీటీఈ కొత్త కాలేజీలకు, అదనపు సీట్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తోంది. ఎన్‌సీటీఈ అనుమతులు ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటికి తప్పనిసరి పరిస్థితుల్లో గుర్తింపు ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కాలేజీలు 439 ఉండగా, వాటిలో 36,260 సీట్లున్నాయి. డీఈడీ కాలేజీలు 850 ఉండగా, వాటిలో 65,350 సీట్లున్నాయి.

ప్రతిఏటా వేలాది మంది డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసుకుని, బయటకు వస్తున్నారు. వారందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రభుత్వం 2018లో నిర్వహించిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టుకు ఏకంగా 5.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. డీఎస్సీకి కూడా ఇంతే సంఖ్యలో దరఖాస్తు చేశారు. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో కొత్తగా కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. గతంలో డీఈడీ, బీఈడీ కోర్సుల కాలపరిమితి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం ఏడాది మాత్రమే ఉండేది. దాన్ని 2015–16 నుంచి రెండేళ్లకు పెంచారు. దీంతో ఈ కోర్సుల్లో చేరేందుకు చాలామంది ఇష్టపడడం లేదు. వేల సంఖ్యలో సీట్లు ఉంటే, చేరే వారు వందల మంది కూడా ఉండడం లేదు.   

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి 
కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ కాకపోతుండడంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు లెఫ్ట్‌ ఓవర్‌ (మిగిలిపోయిన) సీట్ల భర్తీ పేరిట నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో దళారులను నియమించుకుని, అక్కడి నుంచి అభ్యర్థులను రప్పిస్తున్నాయి. కాలేజీలకు రాకపోయినా ఫర్వాలేదు, మీ సర్టిఫికెట్లు ఇచ్చి చేరితే చాలు చివర్లో పరీక్షలు రాయడానికి వస్తే చాలంటూ మచ్చిక చేసుకుంటున్నాయి. సదరు అభ్యర్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయిస్తూ కాలేజీల యాజమాన్యాలు ఈ కోర్సులను ఒక తంతులా మార్చేశాయన్న ఆరోపణలున్నాయి.  

తూతూమంత్రంగా తనిఖీలు  
డీఈడీ, బీఈడీ కాలేజీల నిర్వహణ ఎలాసాగుతోందో తనిఖీలు చేసే యంత్రాంగమే లేదు. డీఈడీ కాలేజీలను పర్యవేక్షించాల్సిన పాఠశాల విద్యాశాఖలో సిబ్బంది కొరత ఉంది. పైగా ఆయా కాలేజీల నుంచి ముడుపులు స్వీకరిస్తూ చూసీచూడనట్లు మిన్నకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. బీఈడీ కాలేజీలను పర్యవేక్షించాల్సిన వర్సిటీలు కూడా తూతూమంత్రంగా తనిఖీలను చేపడుతున్నాయి. ఫలితంగా ఎలాంటి తరగతుల నిర్వహణ లేకపోయినా... సిబ్బంది లేకపోయినా అంతా సవ్యంగా ఉన్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. బోధనా సిబ్బందికి ఇచ్చే వేతనాలు అత్యల్పంగా ఉంటుండడంతో ఒకే లెక్చరర్‌ నాలుగైదు కాలేజీల్లో బోధిస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి.  

కాలేజీల్లో ప్రమాణాలు పెంచితేనే
రాష్ట్రంలో డీఈడీ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసిన వారికి మాత్రమే అర్హత ఉండేది. అందువల్ల ఈ కోర్సుకు, కాలేజీలకు ఆదరణ లభించేది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారిని కూడా అర్హులుగా పరిగణిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో విద్యార్థులు బీఈడీ కోర్సుపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా డీఈడీ కోర్సులకు డిమాండ్‌ పడిపోతోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రైమరీ టీచర్లుగా డీఈడీ చేసిన వారినే నియమిస్తే డీఈడీ కోర్సుకు ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం డీఈడీ, బీఈడీ కాలేజీల్లో ప్రమాణాలు దిగజారాయి. ప్రమాణాలు పెంచితే మళ్లీ ఆదరణ పెరగడం ఖాయం.    
– రవీందర్‌రెడ్డి, డైట్‌సెట్‌ కన్వీనర్‌  

తనిఖీలు నిర్వహించాకే ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి
ఉపాధ్యాయ విద్య మెరుగుపడాలంటే ప్రస్తుతం ఉన్న కాలేజీలను పటిష్టం చేయాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే పరిస్థితిలో మార్పు వస్తుంది. బీఈడీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేయాలి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన తరువాతే ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి. ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రమాణాలు పెరిగితే డీఈడీ, బీఈడీ కోర్సులకు ఆదరణ దక్కే అవకాశం ఉంది.  
– ప్రొఫెసర్‌ కుమార స్వామి, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌   

Advertisement
Advertisement