
శృంగవరపుకోట రూరల్: ఉన్న భూమంతా తమకే ఇచ్చేయాలంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులపైనే కుమారుడితో కలసి ఓ కుమార్తె దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...మండలంలోని తిమిడి గ్రామానికి బత్తిన సింహాద్రి, నారాయణమ్మలకు నలుగురు కుమార్తెలు. వీరిలో మొదటి, మూడో సంతానం చనిపోయారు. రెండో కుమార్తె వి.ఈశ్వరమ్మ భర్తను విడిచిపెట్టి అండమాన్ వెళ్లిపోయి తిరిగి ఇక్కడకు ఇటీవల వచ్చింది. వృద్ధుల పేరిట ఉన్న ఎకరంపావు పొలాన్ని తనకు ఇవ్వాలని ఈశ్వరమ్మ తన కుమారుడు రాముతో కలసి కొన్నాళ్లుగా అడుగుతోంది. దీంతో తామెలా బతకాలని వృద్ధ దంపతులు ఇవ్వలేదు. ఇలా కొన్నాళ్లుగా తమపై తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చింది.
ఈ క్రమంలో వృద్ధులు సాగు చేస్తున్న భూమిలో ఈశ్వరమ్మ నువ్వు చేను వేసింది. ఆ పంటను తాము కోయగా కోపంతో ఈశ్వరమ్మ మొత్తం తగులబెట్టింది. ఈ వివాదం పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ తన కుమారుడితో శనివారం వచ్చి తమపై దాడి చేసి గాయపరిచిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సగం భూమి ఇస్తామన్నా వినకుండా మొత్తం భూమి ఇచ్చేయాలని వివాదానికి వస్తోందని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆ వృద్ధ దంపతులు ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎస్.అమ్మినాయుడు తెలిపారు.