‘కృష్ణ’ గారడి! | 'Dark' juggling! | Sakshi
Sakshi News home page

‘కృష్ణ’ గారడి!

Jul 19 2014 4:28 AM | Updated on Jun 4 2019 5:04 PM

‘కృష్ణ’ గారడి! - Sakshi

‘కృష్ణ’ గారడి!

జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

  • సహకార ఎన్నికలకు మళ్లీ బ్రేక్
  • మంత్రి స్టేతో ఆగిన తొమ్మిది పీఏసీఎస్‌ల ఎన్నికలు
  • అప్పుడు మంత్రి కృష్ణారెడ్డి, ఇప్పుడు గోపాలకృష్ణారెడ్డి ఎఫెక్ట్
  • టీడీపీ మద్దతుదారులు ఓడిపోతారనే భయం
  • పలమనేరు: జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సహకార శాఖ మంత్రి కృష్ణారెడ్డి ఈ ఎన్నికలకు స్టే ఇచ్చారు. ఈసారి టీడీపీకి చెందిన మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఈ ఆదేశాలను జారీచేశారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలవరనే సమాచారంతోనే ప్రభుత్వం ఈ ఎత్తుగడకు పూనుకున్నట్టు తెలుస్తోంది.
     
    తొమ్మిది పీఏసీఎస్‌లకు వాయిదా పడిన ఎన్నికలు
     
    జిల్లాలోని మదనపల్లె డివిజన్‌కు సంబంధించి పుంగనూరు, సోంపల్లె, సదుం, బెరైడ్డిపల్లె, బయప్పగారిపల్లె, చిత్తూరు డివిజన్‌కు సంబంధించి కోసలనగరం, నిండ్ర, తిరుపతి డివిజన్‌కు సంబంధించి సత్యవేడు, పులిచర్ల పీఏసీఎస్‌లకు వచ్చే నెల 10న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లా సహకార శాఖాధికారి వనజ నుంచి సంబంధిత సీఈవోలకు గత శుక్రవారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలందిన విషయం తెలిసిందే.
     
    ఇది రెండోసారి
     
    గత ఏడాది ఈ ఎన్నికలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉన్న పీఏసీఎస్‌లలో గెలుపు ఆ పార్టీదేనని భావించిన నాయకులు ఎన్నికలు జరగనీయకుండా ఎత్తుగడ వేశారు. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ ఎన్నికలను వాయిదా వేయించారు. దీనికి సంబంధించి అప్పటి సహకార శాఖ మంత్రి క్రిష్ణారెడ్డి పేరు మీదుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు నుంచి ఈ ఆదేశాలందాయి. తిరిగి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఈ తొమ్మిది పీఎస్‌సీఎస్‌లలో విజయం దక్కదనే మరోసారి వాయిదా పడింది.
     
    టీడీపీకి ఎదురుగాలి తప్పదనే

    గతంలో ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. ఈ తొమ్మిది సహకార సంఘాలకు సంబంధించి సుమారు 29 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి కొత్త సభ్యత్వాలకు తావులేనట్టేనని అధికారులు చెప్పారు. దీంతో గతంలో ఓటర్లుగా ఉన్న వారితోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ భావించింది. ఈ మధ్యనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన మండలాల్లో ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ల ద్వారా కార్యకర్తల సమావేశం సైతం నిర్వహించారు. ఇందులో ఖచ్చితంగా టీడీపీ గెలవదని అర్థమైంది.  ఆ మేరకు నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకె ళ్లినట్టు సమాచారం. దీంతో పాటు రుణమాఫీ జరగక పోవడంతో రైతుల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఫలితంగానే ఎన్నికలను వాయిదా వేయించినట్టు తెలుస్తోంది.
     
    ఇక రైతన్నలకు కష్టాలే..
     
    తొమ్మిది పీఏసీఎస్‌ల పరిధిలోని రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే కార్యవర్గాలు లేక సహకార సంఘాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక పర్సన్ ఇన్‌చార్జ్‌లతోనే సొసైటీల పాలన సాగడంతో రైతులకు మేలు చేకూరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
     

Advertisement
 
Advertisement
Advertisement