ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న అక్రమాల గుట్టును జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు నిర్ధారించింది.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న అక్రమాల గుట్టును జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు నిర్ధారించింది. ముఖ్యంగా ఒంగోలు, చీరాల, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడ్డగోలుగా అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిన విషయాన్ని ధ్రువీకరించింది. అదే సమయంలో అక్రమంగా చేర్చిన ఓటర్ల లెక్కను తేల్చింది.
చీరాల నియోజకవర్గంలో 3976 మంది వాస్తవ ఓటర్లను, పర్చూరు నియోజకవర్గంలో 1610 మందిని, ఒంగోలు నియోజకవర్గంలో 37 మంది వాస్తవ ఓటర్లను జాబితాలో నుంచి తొలగించినట్లు నిర్ధారించింది. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో 340 ఓట్లు, ఒంగోలు నియోజకవర్గంలో 257 ఓట్లు అక్రమంగా చేర్చినట్లు గుర్తించింది. సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లపై సైబర్ నేరాల కింద కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
వైఎస్‌ఆర్‌సీపీ లక్ష్యంగా..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఓటర్ల జాబితాలో కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారు. ఆ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చారు. వాస్తవానికి ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా జరగాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా బయటకు వచ్చేవరకు అందులోని వివరాలు బయటకు పొక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అయితే తాజాగా జరుగుతున్న ఓటర్ల నమోదులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమదారిలోకి తెచ్చుకున్నారు.
పర్యవసానమే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా అక్రమాల చిట్టాగా మారింది. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యుడు, వైఎస్‌ఆర్‌సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు నియోజకవర్గ పార్టీ నాయకుడు గొట్టిపాటి భరత్, చీరాల నియోజకవర్గ నాయకులు పలుమార్లు కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు మండలంలో 624 ఓట్లు అక్రమంగా తొలగించారు. మార్టూరు మండలంలో 495 ఓట్లు అక్రమంగా తొలగించగా, 20 అక్రమంగా ఓట్లు చేర్చారు. చినగంజాంలో 231 ఓట్లు తొలగించగా, 163 ఓట్లు చేర్చారు. పర్చూరు మండలంలో 180 ఓట్లు తొలగించ గా, 87 ఓట్లు చేర్చారు. కారంచేడు మండలంలో 50 ఓట్లు తొలగించి, 40 ఓట్లు చేర్చారు. యద్దనపూడి మండలంలో 30 ఓట్లు తొలగించ గా, 30 ఓట్లు చేర్చారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల మండలంలో 3299 ఓట్లు, వేటపాలెం మండలంలో 337 ఓట్లు అక్రమంగా తొలగించారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు లో 37 ఓట్లు అక్రమంగా తొలగిం చారు. ఈ మేరకు జిల్లా యంత్రాం గం వీటిని నిర్ధారించడం గమనార్హం.
పోలీసు విచారణకు ఆదేశం...
ఓటర్ల నమోదులో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం పోలీసు విచారణకు ఆదేశించింది. పర్చూరు, చీరాల, ఒంగోలు నియోజకవర్గాల్లోని అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకుమార్ ఎస్పీకి సూచించా రు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అధికారులంతా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటు హక్కు కల్పిస్తాం
ఓటు హక్కు కోల్పోయిన వారికి ఓటరుగా చేరేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ విజయకుమార్ స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సెక్షన్ 22 ప్రకారం సుమోటో కింద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో నమోదు ప్రక్రియ చేపట్టవచ్చన్నారు. సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు ఫారం-6 తీసుకొని ఓటర్లుగా చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు.


