జయ నామ సంవత్సరంలో అన్నివర్గాల వారికి జయం కలగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఆకాంక్షించారు.
సాక్షి, హైదరాబాద్: జయ నామ సంవత్సరంలో అన్నివర్గాల వారికి జయం కలగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా సోమవారం రవీంద్రభారతిలో జరిగిన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధించాలని మహంతి ఆకాంక్షించారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎస్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుభాషకు సంబంధించి విధాన పత్రం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు మాచిరాజు వేణుగోపాల్, చిలుకూరి శ్రీనివాస్‌లు పంచాంగాన్ని పఠిస్తూ... జయనామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పథకాల అమలుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేస్తాయని, అంతా శుభమే జరుగుతుందని తెలిపారు. నూతన సంవత్సర పంచాంగంతో పాటు కవిత సంపుటాలను సీఎస్ మహంతి ఆవిష్కరించారు.