ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. | Counseling in the management of delayed | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఎదురుచూపులు..

Aug 10 2014 1:20 AM | Updated on Mar 21 2019 9:05 PM

ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. - Sakshi

ఎన్నాళ్లీ ఎదురుచూపులు..

సరికొత్త ఆశలతో కళాశాలల వైపు అడుగులు వేయాల్సిన విద్యార్థులు.. ప్రభుత్వ నిర్వాకం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  •          కౌన్సెలింగ్‌ల నిర్వహణలో తీవ్ర జాప్యం
  •          ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అడ్మిషన్లకు లింకు
  •          ఆశీంచిన సీటు రాకపోతే ఇబ్బందే
  •          ఇతర కోర్సుల్లో చేరేందుకు ముగుస్తున్న గడువు
  •          ఆందోళనలో విద్యార్థులు
  • తిరువూరు : సరికొత్త ఆశలతో కళాశాలల వైపు అడుగులు వేయాల్సిన విద్యార్థులు.. ప్రభుత్వ నిర్వాకం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటా జూలై మొదటి వారంలోపు అడ్మిషన్లు పూర్తి చేసి అన్ని కళాశాలల్లో తరగతులు ప్రారంభించేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పలు వృత్తివిద్య, ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో ఆయా కోర్సుల్లో సీట్లు రాకపోతే సాధారణ విద్యకూ దూరమవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డైట్ సెట్ రాసినవారు 8వేల మంది, ఎడ్‌సెట్ అభ్యర్థులు 5,300 మంది, పాలిటెక్నిక్ ప్రవేశం కోసం మరో పది వేల మంది ఎదురుచూస్తున్నారు.
     
    పాలీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించినా..
     
    పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. కానీ సీట్ల కేటాయింపును నిలిపివేశారు. దీంతో పాలిటెక్నిక్‌లో సీటు రాకపోతే ఇంటర్‌లో చేరేందుకు గడువు కూడా ముగిసిపోతుందని, త్వరగా సీట్ల అలాట్‌మెంట్‌ను ప్రకటించాలని విద్యార్థులు కోరుతున్నారు.
     
    డిగ్రీలో చేరేందుకు ఇబ్బందులు!
     
    నేరుగా అడ్మిషన్లు నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్, వెటర్నరీ, హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ రాసిన తర్వాత ఏజీబీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ తమకు సీట్లు ఎప్పుడు కేటాయిస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న కోర్సులో సీటు వస్తుందా.. లేదా.. రాకపోతే పరిస్థితి ఏమిటని సతమతమవుతున్నారు.
     
    రీయింబర్స్‌మెంట్ తేలితేనే..
     
    రాష్ట్ర విభజన తర్వాత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం ఎవరు మోయాలనే విషయమై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఉన్నత విద్యలో ప్రవేశాలు నిలిచిపోయాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో మిగిలిన కోర్సులకు కూడా త్వరగా అడ్మిషన్లు నిర్వహించి విద్యా సంవత్సరాన్ని కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు. ఏజీబీఎస్సీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం తేలిన తర్వాతే తరగతులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. విద్యార్థులు లేక ఆయా కళాశాలలు వెలవెలబోతున్నాయి.
     
    సమాచారం లేదు
    శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏజీ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాను. మూడో సంవత్సరం తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులు చెప్పట్లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం తేలితేనే క్లాసులు నిర్వహిస్తామంటున్నారు. ఇప్పటికే రెండు నెలలు వృథా అయ్యాయి.     
    -రాణీప్రహర్ష, తిరువూరు
     
    సమయం వృథా  
    పదో తరగతి పాసైన తర్వాత పాలిటెక్నిక్‌లో చేరేందుకు పాలీసెట్ రాశాను. కళాశాల ఆప్షన్లను కూడా ఆన్‌లైన్లో నమోదు చేసుకున్నాను. నెల రోజులుగా సీట్ల కేటాయింపును వాయిదా వేస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవట్లేదు. పాలిటెక్నిక్ కోర్సులో సీటు వస్తుందో.. రాదో తెలియడంలేదు. వేరే కోర్సుల్లో చేరలేక ఆందోళనకు గురవుతున్నాను.    
     - వీరేంద్ర, తిరువూరు
     
     సీట్లు కేటాయించాలి
     పాలీసెట్ అభ్యర్థులకు త్వరగా సీట్లు ఖరారు చేయాలి. సీటు రానివారు ఇతర కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్ ప్రవేశాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనతో విలువైన విద్యా సంవత్సరం వృథా అవుతోంది. వెంటనే సీట్ల కేటాయింపును ప్రకటించాలి.    
     - కార్తీక్, తిరువూరు
     
     ఖాళీగా ఉంటున్నాం
     తోటి విద్యార్థులు ఇంటర్మీడియెట్ తదితర కోర్సుల్లో చేరి కళాశాలలకు వెళ్తున్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసిన మాలాంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖాళీగా ఉంటున్నాం.
     - నాగరాజు, తిరువూరు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement