సర్వశిక్షా అభియాన్‌లో  అచ్చెంగా అవినీతి!

Corruption In Sarva Shiksha Abhiyan Srikakulam - Sakshi

నాటి మంత్రుల కనుసన్నల్లోనే ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీ

ఒక్కో పోస్టుకు రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు వసూలు

బేరసారాల మేరకు నియామకాలు 

కలెక్టర్‌ అనుమతి లేకుండా ఏకపక్షంగా జాయినింగ్‌  

కుమ్మక్కైన నాటి అధికారులు, పాలకులు 

ఆలస్యంగా తెలుసుకున్న నాటి కలెక్టర్‌  ధనంజయరెడ్డి

గట్టిగా నిలదీయడంతో హడావుడిగా అనుమతి కోసం ఫైలు పెట్టిన ఏజెన్సీ ప్రతినిధులు

జాయినైన మూడు నెలల తర్వాత అనుమతి తీసుకున్న పరిస్థితి 

వ్యవహారంలో చేతులు మారిన మొత్తం రూ. 3కోట్లు   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వశిక్షా అభియాన్‌ ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకాల్లో ‘అచ్చెం’గా  అక్రమాలు జరిగాయి. అచ్చెన్న...శీనన్న పేరు చెప్పి పోస్టులమ్మేసుకున్నారు. నాటి మంత్రుల కనుసన్నల్లోనే తంతంగం జరగడంతో కలెక్టర్‌ అనుమతి లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. అధికారులెవ్వరికీ తెలీకుండానే జాయిన్‌ చేసేసుకున్నారు. ఒక రోజున నాటి కలెక్టర్‌ ఆరా తీసే సరికి వారి బాగోతం బయటపడింది. తమ దృష్టికి తీసుకురాకుండా ఎలా నియమించారని ప్రశ్నించేసరికి అనుమతుల కోసం హడావుడిగా ఫైలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 3కోట్ల వరకు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.

 పద్ధతికి విరుద్ధంగా..
సాధారణంగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని కలెక్టర్‌ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ఖరారు చేసే బాధ్యతలను కలెక్టర్ల నుంచి తప్పించి ప్రభుత్వమే ఏకపక్షంగా ఔట్‌ సో ర్సింగ్‌ ఏజెన్సీలను ఖరారు చేసింది. ఖరారు చేసిన ఏజెన్సీలు ఎప్పటినుంచో పనిచేస్తున్నవనుకుంటే పప్పులో కాలేసినట్టే. టీడీపీ నేతల బినామీ ఏజెన్సీలుగా అప్పటికప్పుడు ఏర్పాటైనవే. ఏ జిల్లాకు ఏ ఏజెన్సీకి, ఏ శాఖ ల ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు అప్పగించాలన్నది అమరావతి స్థాయిలోనే కేటాయింపులు చేసి జిల్లాలకు వాటి ఉత్తర్వులకు పంపించేవారు. ఇంకేముంది టీడీపీ మంత్రుల కనుసన్నల్లో ఆ పార్టీ నేతల బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కొక్క పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి.

ఏజెన్సీల ముసుగులో చెలరేగిపోయిన టీడీపీ నేతల బినామీలు..
సర్వశిక్షా అభియాన్‌ ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు కూ డా టీడీపీ నేతల బినామీ ఏజెన్సీ ద్వారా అమ్ముకున్నారు. అయితే, తీగలాగితే డొంక కదిలినట్టు సర్వశిక్షా అభియాన్‌ ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకాలను లోతుగా పరిశీలిస్తే నాటి ప్రభు త్వ ఘన కార్యం, పాలకుల నిర్వాకం, అధికా రుల తీరు కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. గత డిసెంబర్‌లో 177 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు వేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. అంతటితో ఆగకుండా ఆ పోస్టుల నియామక బాధ్యతలను స్కాట్లాండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఏజెన్సీకి అప్పగించింది. ఆ మేరకు జిల్లా అధికా రులకు ఉత్తర్వులు పంపించింది. దీంతో 177పోస్టులకు అర్హత గల అభ్యర్థులను సమకూర్చాలని ఆ ఏజెన్సీకి నాటి కలెక్టర్‌ ధనుంజయరెడ్డి ఇండెం ట్‌ ఇచ్చారు. ఇంకే మంచి అవకాశం వచ్చిందని స్కాట్లాండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఏజెన్సీ ముసుగులో జిల్లా వ్యాప్తంగా బేరసారాలు జరిగాయి. లక్షల్లో పోస్టులకు ధర పలికింది. నిరుద్యోగం తీవ్రంగా ఉండటంతో అత్యధిక మంది అభ్యర్థులు సంప్రదింపులు చేసుకుని ముడుపులు ముట్ట జెప్పారు. ఇంకేముంది కొన్ని పోస్టులను పద్ధతిగా నియామకాలు చేసి, చాలా వరకు పోస్టులను అమ్మకాల ద్వారా నియామకాలు చేశారు.

కలెక్టర్‌ అనుమతి లేకుండా 140 పోస్టులకు జాయినింగ్‌..
ఏజెన్సీ చేపట్టిన నియామకాల అభ్యర్థుల జాబి తాను కలెక్టర్‌కు అందజేసి, వారి అనుమతితో జాయిన్‌ చేసుకోవాలి. కానీ ఇక్కడ 140 పోస్టులకు సంబంధించి అనుమతి తీసుకోకుండా నేరుగా జాయిన్‌ చేసుకున్నారు. కలెక్టర్‌కు తెలీకుండా తంతు అంతా నడిచిపోయింది. ఈ విషయాన్ని నాటి కలెక్టర్‌ ధనుంజయరెడ్డి ఆలస్యంగా తె లుసుకున్నారు. దీంతో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. 140 పోస్టులకు అనుమతి తీసుకోకుండా ఎలా జాయిన్‌ చేసేశారని నిలదీయడంతో అప్పటికప్పుడు హడావుడిగా ఫైల్‌ పెట్టారు. ఇదంతా ఫిబ్రవరిలో జరిగింది. ఇంతలో కలెక్టర్‌ ధనుంజయరెడ్డికి బదిలీ అయిం ది. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్‌ హయాంలో వాటి కి అనుమతి లభించింది. ఈ లెక్కన డిసెంబర్‌లో జాయిన్‌ చేసుకుని ఫిబ్రవరి వరకు కలెక్టర్‌కు తెలీకుండా వారందరినీ కొనసాగించినట్టుగా భావించాలి. అలా ఎందుకు చేశారో నాటి సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు ఆఫీసరే చెప్పాలి. ఇదంతా పాలకులు, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ, సర్వశిక్షా అభియాన్‌ అధికారులు గూడు పుఠాణై నడిపిన బాగోతమే అన్నది తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 3కోట్ల వరకు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top