న్యాయ సేవాచట్టంపై అవగాహనకు కృషి | Contributed to an understanding of the legal sevacattampai | Sakshi
Sakshi News home page

న్యాయ సేవాచట్టంపై అవగాహనకు కృషి

Nov 9 2014 1:19 AM | Updated on Sep 2 2017 4:06 PM

గుంటూరు లీగల్: జాతీయ న్యాయసేవాధికార చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడతున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.రఫీ చెప్పారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.రఫీ
 
 గుంటూరు లీగల్: జాతీయ న్యాయసేవాధికార చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడతున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.రఫీ చెప్పారు. ఆదివారం జాతీయ న్యాయసేవా దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ 1995 నవంబర్ 9న ఈ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అటువంటివారికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు, ప్రక ృతి విపత్తులకు గురైనవారు, హింసాకాండ, కుల వైషమ్యాలు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తుల్లో చిక్కుకున్నవారు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు జిల్లాలో 1095 లోక్‌అదాలత్‌లు, 5 మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహించగా 48,141 మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. జిల్లాలో 321 న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 న్యాయ సహాయ చేయూత కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 లీగల్ లిటరసీ కేంద్రాల ఏర్పాటు
 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.రమణకుమారి మాట్లాడుతూ గుంటూరు నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ లిటరసీ క్లబ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక విధులపై జూనియర్ కళాశాల విద్యార్థులకు, ‘శాసన విజ్ఞాన పరిచయం’ అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

విజేతలకు ఆదివారం జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామన్నారు. సమస్యపై ప్రజలు నేరుగా కోర్టుకు వెళ్లకుండా తమను ఆశ్రయిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజ లకు సహాయం అందించేందుకు న్యాయ సహాయ చేయూత కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో న్యాయవాది, పారా లీగల్ వాలంటీరు ప్రతి శనివారం అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

Advertisement

పోల్

Advertisement