రోమియో ఖాకీ  బర్తరఫ్‌కు రంగం సిద్ధం?

Constable Dismiss In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం:  తప్పు చేసిన పోలీసు సిబ్బందిపై ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు కొరడా ఝుళిపించనున్నారా? అలాంటి వారిని పోలీస్‌ విధుల నుంచి శాశ్వతంగా తప్పించునున్నారా? తదితర ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన పలువురిపై ఇప్పటికే వీఆర్, సస్పెన్షన్‌ వేటు పడడమే ఇందుకు నిదర్శనం. ఇందులో భాగంగానే మరో మూడు రోజుల్లో ఓ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించేందుకు (రిమూవ్‌ ఫ్రం సర్వీసెస్‌) రంగం సిద్ధమైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అనంతపురం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై ఎస్పీ కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది.

సదరు కానిస్టేబుల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న యువతిని గత కొంతకాలంగా వేధిస్తూ వచ్చాడు. దీనిపై బాధితురాలు అక్కడి బంజరాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినా ఆ కానిస్టేబుల్‌లో మార్పు రాలేదు. ఫోన్‌ నంబర్‌ మార్చి అసభ్యకర మెసేజ్‌లు పోస్టు చేస్తుండడంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు దృష్టికి తెలంగాణ పోలీసులు తీసుకువచ్చారు. ఆయన విచారణలో సైతం ఇది నిజమని నిర్ధారణ అయింది. దీంతో ఆ రోమియో కానిస్టేబుల్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలిగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top