గీత దాటితే మోతే

Conditions Of Traffic Rules In West Godavari - Sakshi

అంబులెన్స్‌కు దారివ్వకపోతే రూ. 10వేలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు రూ. 10వేలు

సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : ఇకపై ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా ఫైన్‌ మోత మోగనుంది. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా, శిక్ష రెండూ అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలన్నీ కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ మంత్రివర్గం తీర్మానించింది. ఇకపై చిన్నపిల్లలకు (మైనర్‌లకు) వాహనాలు ఇస్తే పిల్లల తల్లితండ్రులకు, సంరక్షులు లేదా వాహనం ఇచ్చిన వ్యక్తికి రూ. 25వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్సు కూడా రద్దు చేసే అవకాశముంది. వారి పిల్లలు ప్రమాదం చేస్తే తల్లితండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు.

అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ. 10వేల రూపాయలు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. డ్రైవింగ్‌ చేసేందుకు అనర్హులై వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా చెల్లించాలి. ఇక డ్రైవింగ్‌ లైసెన్సు ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ. 1000 నుంచి రూ. 2000 జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2 వేలు జరిమానా చెల్లించాలి.  సీటు బెల్టు ధరించకపోతే రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేస్తారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించినా రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్‌ లైసెన్సు రద్దవుతుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధిస్తారు.

అధికారుల ఆదేశాలు పాటించకుంటే గతంలో రూ.500 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు దానిని రూ. 2 వేలకు పెంచారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5 వేలు, మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా నడిపితే రూ. 5 వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రవాణా చేసే వాహనాలు ఓవర్‌ లోడింగ్‌ చేస్తే రూ. 20 వేలు పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు మార్పు చేశారు. ఇలాంటి నిబంధనలు స్వయంగా సంబంధిత అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపవుతాయి. దీనికి కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇటీవల కాలంలో జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి కఠిన నిబంధనలతో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top