ఇదేమి పెళ్లి కానుక! | Conditions in chandranna pelli kaanuka scheme | Sakshi
Sakshi News home page

ఇదేమి పెళ్లి కానుక!

Aug 31 2018 3:34 AM | Updated on Aug 31 2018 3:34 AM

Conditions in chandranna pelli kaanuka scheme - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్లు ఆయా కుటుంబాల వారికి భారం కాకుండా ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద ఆదుకుంటామంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి పలు షరతులు, పరిమితులు విధిస్తూ ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. ఇంతకుముందు పెళ్లికుమార్తెకు తెల్లరేషన్‌ కార్డు ఉంటే పెళ్లికానుక వర్తింపజేసేవారు కాగా.. ఇప్పుడు వధూవరులిద్దరికీ తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే పెళ్లి కానుక వర్తిస్తుందని నిబంధన పెట్టడం ఇందుకు నిదర్శనం. దీంతో వధూవరుల్లో ఏ ఒక్కరికి తెల్ల కార్డు లేకపోయినా కానుక రాదన్నమాట.

పెళ్లికానుకను పెళ్లికుమార్తె అకౌంట్‌కు జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇందుకోసం పెళ్లికి 15 రోజులు ముందుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టింది. దీన్నిబట్టి పెళ్లయ్యాక పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకుంటే ఉపయోగం ఉండబోదు. అంతేకాదు.. పది రోజుల్లో పెళ్లి కుదుర్చుకుని లగ్నాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. నిబంధనల ప్రకారం 15రోజుల ముందు మాత్రమే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి పెళ్లి పత్రిక కూడా రెడీగా ఉండాలి. అప్పుడే ఈ కానుక వర్తిస్తుంది. దీనినిబట్టి పేద కుటుంబాలలోని వారికి ఆడపిల్లల పెళ్లి పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది స్పష్టమవుతోంది.

గతంలో ఎలా ఉండేది...
గతంలో దుల్హన్‌ పథకం కింద ముస్లిం మైనార్టీలకు, గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద గిరిజనులకు ఆర్థిక సాయం అందేది. వీరి పెళ్లికార్యానికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందించేది. ఆ మేరకు గిరిజన వధువు, ముస్లిం వధువు అకౌంట్‌కు డబ్బులు జమయ్యేవి. పెళ్లికుమార్తెకు తెల్ల రేషన్‌కార్డు ఉంటే సరిపోయేది. పైగా పెళ్లికి నెలరోజుల ముందు నుంచి పెళ్లిరోజు వరకు కానీ, పెళ్లయిన రెండు నెలల వరకు ఎప్పుడైనా పెళ్లి కానుకకోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడిది రద్దయ్యింది.

మూడు నెలలుగా ‘కానుక’ లేదు
ఇదిలా ఉంటే.. పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకునేందుకు జ్ఞానభూమి వెబ్‌సైట్లో లింక్‌ ఇవ్వగా.. ఇది మూడు నెలలుగా పనిచేయట్లేదు. దీంతో మూడునెలలుగా పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే వీల్లేకపోయింది. ఫలితంగా ఐదువేల మంది ముస్లింలు పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయారు.

ఇక గిరిజనుల్లో దాదాపు పదివేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయారు. ఇక ఎస్సీ, బీసీల్లో సుమారు 25వేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయినట్లు అధికారులే చెబుతుండడం గమనార్హం. మరోవైపు వెబ్‌సైట్‌ లోపాల వల్ల దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ సుమారు 25వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెళ్లి కానుక అందలేదని సమాచారం. ఈ విధంగా పేదరికంలో ఉన్న ఆడపిల్లల పెళ్లికోసం ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పెళ్లి కానుక పథకం ప్రభుత్వం పెట్టిన తిరకాసులతో వారికి ఏమాత్రం అందకుండా పోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement