ఉద్యోగుల కష్టార్జితాన్ని కాజేసింది!

Comptroller and Auditor General Fires On Past TDP Government - Sakshi

రూ.730.94 కోట్ల సీపీఎస్‌ సొమ్ముకు టీడీపీ సర్కారు ఎసరు

కాగ్‌ నివేదికలో వెల్లడి  

సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగుల పెన్షన్‌కు గత సర్కారు కన్నం వేసింది. టీడీపీ సర్కారు 2017–18లో ఆర్థిక ఏడాది ముగింపు నాటికి రూ.730.94 కోట్ల సీపీఎస్‌ సొమ్మును నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ ట్రస్టీ బ్యాంకుకు జమ చేయలేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక స్పష్టం చేసింది. సీపీఎస్‌ సొమ్మును సక్రమంగా వినియోగించకపోవడంతో ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం, వడ్డీ రేటులో అనిశ్చితి ఏర్పడిందని కాగ్‌ తెలిపింది. ఈ డబ్బులను బ్యాంకుకు జమ చేయనందున ఉద్యోగులకు రావాల్సిన వడ్డీ రాదని, దీన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఇతర అవసరాలకు వాడకం.. 
సీపీఎస్‌ ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెల పది శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం మినహాయిస్తుంది. మరో పది శాతం సొమ్మును కలిపి నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌కు జమ చేయాలి. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగుల వాటా సొమ్ముతో పాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన పది శాతం సొమ్మును ఇతర అవసరాలకు వాడేసింది. సీపీఎస్‌లో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ చాలా తక్కువగా వస్తోందని, దీన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దీనిపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top