
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఆర్.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, డి.రమేశ్, ఎన్.జయసూర్యల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు టి.వినోద్‌కుమార్, ఎ.అభిషేక్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌లను సిఫారసు చేసింది. ఉమ్మడి హైకోర్టులో అప్పటి హైకోర్టు కొలీజియం 2018 అక్టోబర్ 9న ఈ ఏడుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది.
తాజాగా ఈ ఏడుగురితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం గురువారం ముఖాముఖీ సమావేశమైంది. అనంతరం రెండు రాష్ట్రాల హైకోర్టులకు వీరి పేర్లను సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు వీరు సరిగ్గా సరిపోతారని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత రాష్ట్రపతి వద్దకు వెళతాయి. రాష్ట్రపతి ఆమోదించాక వీరి నియామకాలపై కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరుకుంటుంది.