గాంధీ పేరు రాయలేకపోతున్నారు!

Chittoor Collector Narayana Bharath Gupta Meeting with Officers - Sakshi

సాక్షి, చిత్తూరు : ‘పదో తరగతి విద్యార్థి గాంధీ పేరు రాయలేకపోతున్నాడు. నేను పాఠశాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం గుర్తించాను. ఇందుకు కారకులెవరు?.’ అని కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తాను గమనించానన్నారు.   తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సిగరెట్‌ ముక్కలు పడి ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితులుంటే హెచ్‌ఎంలు ఏమీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

పెండింగ్‌లో ఉన్న తరగతి గదులు, ప్రహారీ గోడలు తదిత ర పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో ‘నా మొక్క – నా బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో డీఈఓ పాండురంగస్వామి, సమగ్ర శిక్షా అభియాన్‌ పీఓ మధుసూదనవర్మ, డీవైఈఓ పురుషోత్తం, సోషల్‌ ఫారెస్ట్‌ డీఎఫ్‌ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలి 
జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన  పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్యాకేజీ టూర్ల బలోపేతానికి ఏపీ పర్యాటక సంస్థ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జేసీ మార్కండేయులు, జేసీ2 చంద్రమౌళి, జిల్లా టూరిజం అధికారి చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.  

మైక్రో ఇరిగేషన్‌ అనుసంధానం చేయాలి
నీటి వసతి ఉన్న ప్రతి రైతు నుంచి దరఖాస్తులను ఆహ్వానించి మైక్రో ఇరిగేషన్‌కు అనుసంధానం చేయాలని కలెక్టర్‌ అన్నారు. ఏపీఎంఐపీ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కువ నీరు అవసరమైన చెరుకు, వరి పం టలకు మైక్రో ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి గత ఏడాది పూర్తి కాని బిందు సేద్యం పరికరాల అమరిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.  

మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు
జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఆ శాఖతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.  క్యాన్సర్‌ పై అవగాహన, నివారణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top