అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తమ గ్రామానికి ఏం చేశారని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని కలెక్టర్ సమక్షంలో
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని నిలదీసిన చీడివలస వాసులు
కలెక్టర్ సమక్షంలోనే నిలదీత
ఇద్దరు అంగన్‌వాడీ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్
చీడివలస(పోలాకి): అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తమ గ్రామానికి ఏం చేశారని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని కలెక్టర్ సమక్షంలో ప్రజ లు నిలదీశారు. బుధవారం పోలాకి మండలం చీడివలస గ్రామంలో ఇంకుడుగుంతలు కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీనృసింహం, ఎమ్మెల్యేలు హాజరై అనంతరం సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రుణమాఫీ వంటి పథకాలను వివరించారు. అయితే స్థానిక సర్పంచ్ ముదాడ సరోజిని ఆధ్వర్యంలో ప్రజలు ఎమ్మెల్యే ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు.
కక్ష సాధిం పుతో పింఛన్లు తొలగించడం తప్ప ఏం చేశారని ప్రజలు నిలదీశారు. తాగునీరు ఇవ్వలేదని, రోడ్డు కూడా బాగు చేయలేదని కలెక్టర్ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. ఒకానొక సమయంలో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కొంతమం ది కావాలనే రాజకీయాలు చేస్తున్నారంటూ అక్కడ ఉన్న జనాలను ఉద్దేశించి అన్నారు. దీంతో కలెక్టర్ కలుగజేసుకుని అసలు పంచాయతీలో ఉన్న సమస్యలేంటో చెప్పాలని అన్నారు. స్థానిక నాయకులు ముద్దాడ రాము, బైరాగినాయుడులు కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరారు.
అంగన్‌వాడీ సిబ్బంది సస్పెన్షన్...
కలెక్టర్ లక్ష్మీనృసింహం గ్రామంలోని సమస్యలను చెప్పాలని అనగానే గ్రామానికి చెందిన జోగి తవిటమ్మ అనే మహిళ అంగన్‌వాడీలో ముక్కిపోయిన కందిపప్పు, పురుగులు పట్టిన సరుకులు ఇస్తున్నారని ఎందుకు పట్టించుకోవటం లేదో చెప్పాలని నేరుగా కలెక్టర్‌నే నిలదీశారు.
దీంతో వెంటనే సంబంధిత కార్యకర్త జగదాంబను, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మిని కలెక్టర్ వివరణ కోరారు. వారు పొంతనలేని సమాధానం చెప్పటంతో కలెక్టర్ ఆగ్రహించారు. వెంటనే సంబంధిత పీడీకి ఫోన్‌లో వారి ఇద్దరికీ సస్పెండ్ ఆర్డర్స్ రెడీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొండు రామన్న, మండలసలహాదారు తమ్మినేని భూషణరావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.