లడ్డూలు ఇప్పిస్తామని.. | Cheaters in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుమలలో దళారుల కలకలం

Aug 18 2018 1:10 PM | Updated on Aug 25 2018 7:11 PM

Cheaters in Tirupati - Sakshi

కౌంటర్‌లో లడ్డూలు తీసుకుంటున్న భక్తులు (ఫైల్‌)

తిరుమల కొండపై దళారులు తిష్ట వేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను రోజుకో విధంగా మోసం చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అద్దె గదులు, ప్రసాదాలు ఇప్పిస్తామని, దర్శనాలు చేయిస్తామని మోసగిస్తున్నా విజిలెన్స్‌ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన ప్రభాకర్‌ తిరుమలలో ఉంటూ నకిలీ ఆధార్‌ కార్డులతో పెద్ద మొత్తంలో ఆన్‌లైన్‌ టికెట్లు డిప్‌ విధానంలో పొందుతున్నాడు. అనంతరం వాటిని ఆధార్‌ కార్డు, ఫొటో మార్ఫింగ్‌ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ దర్శనం చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొందరు సుప్రభాత సేవకు వెళుతుండగా నకిలీ టికెట్లుగా గుర్తించి విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 

► పది రోజుల క్రితం రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సిఫార్సు లేఖను ఒక వ్యక్తి ఫోర్జరీ చేశాడు. దాన్ని తీసుకుని దర్శనానికి వెళుతుండగా నిఘా అధికారులు పట్టుకున్నారు. 

► నలుగురి కోసం ఎమ్మెల్యే ఇచ్చిన లేఖను ఆరుగురికి ఇచ్చినట్టు మార్చి దర్శనానికి వెళుతుండ గా విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. 

తిరుమల: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల వెంకన్నను దర్శించుకోడానికి మన దేశం నుంచే కాకుం డా ఇతర దేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. క్యూలైన్లు కిలోమీటర్ల మేర ఉంటుండడంతో వాటిని చూసి సులభ మార్గాల కోసం దళారీలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు వెంటనే సేద తీరేందుకు గదుల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి నుంచి దళారులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అద్దె గదులు ఇప్పిస్తున్నారు. 

నకిలీ సిఫార్సు లేఖల తయారీ
కొందరు ప్రజాప్రతినిధుల పేర్లతో నకిలీ సిఫారసు లేఖలను తయారు చేస్తున్నారు. తద్వారా అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని అద్దె గదులు ఇప్పించడంతోపాటు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. ఇందుకు టీటీడీ అధికారులు, సిబ్బంది సహకారం మెండుగా ఉండడంతో వారి పని సులభంగా అవుతోంది. సహకరించిన అధికారులకు లంచం కూడా ఇస్తున్నామని కొందరు దళారులు బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల తిరుమలలో ఒక వ్యక్తి మంత్రి లేఖను ఫోర్జరీ చేసి దర్శనం టికెట్లు తీసుకున్నాడు. వాటిని అధిక ధరకు విక్రయించి విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. 

లడ్డూలు ఇప్పిస్తామని..
శ్రీవారి లడ్డూలకు భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు కోరినన్ని లడ్డూలు తొందరగా తీసిస్తామని చెప్పి అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారు. వీరికి కూడా తిరుమలలో టీటీడీ అధికారులు, సిబ్బంది సహకారం పూర్తి స్థాయిలో ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా దళారులకు లడ్డూ కౌంటర్‌ సిబ్బందికి మధ్య లావాదేవీలు నడుస్తున్నట్టు సమాచారం. వీరు టీటీడీ విజిలెన్స్‌ అధికారులకు, సిబ్బందికి వారానికి, నెలకు మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తిరుమలలో దళారులను నియంత్రించాలని భక్తులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement