చంద్రదండు దౌర్జన్యకాండ

Chandra Dandu Prakash Naidu Conflict in Anantapur Municipal Office - Sakshi

మున్సిపల్‌ స్థలం కబ్జా

ఆక్రమణను అడ్డుకున్న అధికారులపై ప్రకాష్‌నాయుడు ఆగ్రహం..

టీ పీఓపై దుర్భాషలు

అనంతపురం సెంట్రల్‌: నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించి చుట్టూ పాతిన బండలను అధికారులు తొలగించారని చంద్రదండు నేత ప్రకాష్‌నాయుడు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి దౌర్జన్యకాండ సాగించాడు. విధులకు భంగం కలిగించడమే కాక నోటికొచ్చినట్లు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలో మారుతీనగర్‌ శివారులోని కేశవరెడ్డి స్కూల్‌ వెనుక వైపు మున్సిపల్‌ ఓపెన్‌ స్థలాన్ని చంద్రదండు ప్రకాష్‌నాయుడు ఆక్రమించాడు. అక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో ఉంది. గతంలో కూడా ఓసారి ఆక్రమించి నర్సరీ చేపట్టాలని చూడటంతో అధికారులు స్పందించి అడ్డుకోవడంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు.

ఎలాగైనా ఆ విలువైన స్థలాన్ని చేజిక్కించుకోవడానికి ఈసారి చుట్టూ బండలతో ఫెన్సింగ్‌ వేయించాడు. స్థలం ఆక్రమణపై ఫిర్యాదు అందుకున్న నగర పాలకసంస్థ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఏప్రిల్‌ 29న అక్రమంగా పాతిన బండలను తొలగించారు. లాక్‌డౌన్‌ కారణంగా కొద్దిరోజులు పట్టించుకోని ప్రకాష్‌నాయుడు నిబంధనల సడలింపుల అనంతరం శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చాడు. నేరుగా టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌లోకి చొచ్చుకుపోయిన అతను టీపీఓ వినయ్‌ప్రసాద్‌పై నోరుపారేసుకున్నారు. ‘నేను పాతిన బండలనే తొలగించే దైర్యం మీకుందా’ అంటూ బెదిరించాడు. అధికారిని దుర్భాషలాడుతుండటంతో నగరపాలక సంస్థ సిబ్బంది మొత్తం గుమిగూడారు. దీంతో కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్‌ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ హుటాహుటిన వచ్చి చంద్రదండు ప్రకాష్‌నాయుడును అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top