జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు వ్యవహారంపై చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు వ్యవహారంపై చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. శుక్రవారం రాత్రి మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో జిల్లా నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఈదర హరిబాబు వ్యవహారమే ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు సమాచారం. ఈదర హరిబాబుపై వేటు వేయాల్సిందేనని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పట్టుబట్టినట్లు సమాచారం.
విప్ ధిక్కరించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈదర హరిబాబు జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడాన్ని జిల్లా నేతలు జీర్ణించుకోవడం లేదు. ఈదర హరిబాబు పూర్తిగా అవకాశవాదిగా వ్యవహరించారని, ఇప్పుడు పదవి కోసం మళ్లీ తెలుగుదేశం నాయకులను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈదర హరిబాబుపై వేటు వేయాల్సిందేనని పట్టు పడుతున్నారు. అయితే ఇప్పటికే అనర్హత వేటు తప్పించుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.
జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌ను కలిసి మద్దతు కోరారు. వారు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ఈదర హరిబాబు గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కూడా కలిసి వారి మద్దతు కూడగట్టారు. వారి అందరి మద్దతు తనకు ఉందని హరిబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జరిగిన విషయాన్ని పక్కన పెట్టి జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఈదర హరిబాబును పార్టీలో కొనసాగించడమే ఉత్తమమనే అభిప్రాయం పార్టీ పెద్దలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వేటు పడితే మళ్లీ పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో హరిబాబును తమతో కలుపుకుంటే మేలని దేశం నేతలు భావిస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాన్ని బట్టి హరిబాబుపై వేటు పడుతుందా లేదా అన్న నిర్ణయం ఉంటుంది.