కేసరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గన్నవరం: మండలంలోని కేసరపల్లి బైపాస్‌ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ఓ స్కూటీతో పాటు రోడ్డు పక్కన ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరితో పాటు వీఆరోఏ తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టడుతున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం... అన్నవరం నుంచి విజయవాడ వైపు నలుగురు వ్యక్తులు హుందాయ్‌ క్రిటా కారులో విజయవాడ వైపు బయలుదేరారు. సుమారు 120 కిలోమీటర్లు వేగంతో వెళ్తున్న కారు కేసరపల్లి బైపాస్‌ వద్దకు రాగానే జాతీయ రహదారి దాటుతున్న స్కూటీ అడ్డుగా వచ్చింది.

దీంతో వేగ నియంత్రణ కాకపోవడంతో స్కూటీని ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీఆర్‌ఏ మాగంటి ప్రభు(32)ను ఢీకొట్టుకుంటూ జాతీయ రహదారి పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ సుమారు 60 మీటర్ల దూరంలో ఎగిరిపడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరికి, రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీఆర్‌ఏ ప్రభుకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ ప్రభును కానూరు రోడ్డులోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. స్కూటీపై ఉన్న ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి పరిస్ధితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీపీ విజయభాస్కర్‌ నేతృత్వంలో సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ సత్యశ్రీనివాస్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top