రెండేళ్లుగా నష్టాలే | Briquetting industry faces Severe crisis for two years | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా నష్టాలే

Nov 23 2013 6:29 AM | Updated on Sep 2 2017 12:54 AM

ఇటుకల తయారీకి పేరెన్నికగన్న అద్దంకి ప్రాంతంలో ఆ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

అద్దంకి, న్యూస్‌లైన్: ఇటుకల తయారీకి పేరెన్నికగన్న అద్దంకి ప్రాంతంలో ఆ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి కాల్చిన ఇటుకకు డిమాండ్ లేక తయారీ ధరకన్నా తక్కువ ధరకు విక్రయిస్తూ ఇటుకల పరిశ్రమల యజమానులు రెండేళ్లుగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఇంకా ధర వస్తుందని ఆశించి ఇటుకలు నిల్వ చేసిన యజమానులు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుల వడ్డీలు కొండలా పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితం అద్దంకి ప్రాంతంలో 250 బట్టీలుండగా.. ప్రస్తుతం 150 మాత్రమే మిగిలాయి. వీటిలో రూ. 15 కోట్ల ఇటుకల నిల్వలున్నాయి. దీంతో ఈ బట్టీల్లో పనిచేసే 10 వేల మంది కూలీలు ఉపాధి కోల్పోయారు.
 
 అద్దంకి ప్రాంత ఇటుకకు రాష్ట్రంలోనే మంచి పేరుంది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అద్దంకి ప్రాంతానికి వచ్చిన వారు అద్దంకి, తిమ్మాయపాలెం, రామాయపాలెం గ్రామాల్లో 25 ఏళ్ల నుంచి ఇటుక బట్టీలు నడుపుతున్నారు. ఒకటి రెండు బట్టీలతో ప్రారంభమైన ఇటుక పరిశ్రమ క్రమంగా వృద్ధి చెంది 250 బట్టీలకు పెరిగింది. ఒక్కో బట్టీ ఏర్పాటుకు రూ. 15 నుంచి రూ. 25 లక్షల వరకు పెట్టుబడి అవసరం. ఒక్కో బట్టీకి ఇటుక కోసేందుకు, కుంది వేసేందుకు, బట్టీ పేర్చేందుకు 80 నుంచి 100 మంది కూలీలు అవసరమవుతారు.

ఇటుక కోతకు శ్రీకాకుళం, ఉభయగోదావరి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి ఒక్కో జత(ఇద్దరు కూలీలు)కు రూ. 1.50 లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొస్తుంటారు. వీరు కుటుంబాలతో బట్టీ వద్దకు వలస వస్తారు. ఏటా డిసెంబర్ మొదటి వారంలో వచ్చి బట్టీ పనిచేసి మార్చిలో సొంత గ్రామాలకు వెళ్తారు. వీరికి ఇదే ప్రధాన ఉపాధి. ఇటువంటి వారు ఒక్కో బట్టీలో సుమారు 30 మంది వంతున మొత్తం 7 వేల మంది ఉంటారు. స్థానికంగా ఇతర పనులు చేసే వారు మరో 15 వేల మంది ఉంటారు. రెండేళ్లుగా గృహ నిర్మాణాలు తగ్గుముఖం పట్టడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా చేయకపోవడంతో ఇటుకలకు డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం ఇటుక పరిశ్రమ నష్టాల్లో ఉండటంతో వంద బట్టీల వరకు తగ్గిపోయాయి. దీంతో పది వేల మంది ఉపాధి కోల్పోయారు.
 
 తక్కువ ధరకే విక్రయిస్తూ...


 ఇటుకల తయారీకి కావాల్సిన ముడిసరుకులు వరిపొట్టు, మట్టి, వరిపొట్టు బూడిద ధరలు పెరగడంతో వెయ్యి ఇటుకలను రూ. 3,100కు విక్రయిస్తే గిట్టుబాటవుతుంది. కానీ బట్టీల యజమానులు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగకుండా తీర్చేందుకు రూ. 2,700కే విక్రయిస్తున్నారు. దీంతో పెట్టుబడి నష్టాలు తప్పడం లేదు. రెండేళ్ల క్రితం వెయ్యి ఇటుక ధర రూ. 3,400 ఉండేది. అప్పుడు గిట్టుబాటు ధర రూ. 2,500. ప్రస్తుతం 150 బట్టీల్లో మొత్తం 15 కోట్ల ఇటుకల నిల్వలున్నాయి. వీటి విలువ రూ. 45 కోట్లు ఉంటుంది. మళ్లీ ఇటుక బట్టీల సీజను వస్తుండటంతో నిల్వ ఉన్న ఇటుకను ఏం చేయాలి? కూలీలకు ఎలా పనిచూపాలని బట్టీల యజమానులు మీమాంసలో పడ్డారు.  
 
 ముంచిన రియల్ ఎస్టేట్...


 అద్దంకి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు ఇటుక బట్టీల యజమానులు గతంలో తమకు వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితుల్లేక ఏంచేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు.
 

Advertisement
Advertisement