breaking news
Brick making
-
బట్టీల్లో బాల్యం!
కుల్కచర్ల, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా బాలకార్మిక వ్యవస్థపై పోరాటం సాగుతూనే ఉంది. కానీ మార్పు కన్పించడం లేదు. వలస వెళ్తున్న వారి పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. విద్యాహక్కు చట్టం తీసుకొచ్చి హడావుడి చేసినా ఫలితం మాత్రం ఆశించినంత కన్పించడం లేదు. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, పనికీ పెట్టుకుంటే శిక్షలు తప్పవని చేస్తున్న ప్రచారం కొద్దిమేర ఫలిస్తున్నా.. ఆ పిల్లలు బడిమెట్లు ఎక్కేంతగా ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా ఊరికి దూరంగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు పూర్తిగా చదువుకు దూరంగా ఉంటున్నారు. కుల్కచర్ల మండలంలో సుమారు 80కి పైగా ఇటుక బట్టీలున్నాయి. కామునిపల్లి, గంగాపూర్, అంతారం, ఇప్పాయిపల్లి, మక్తవెంకటాపూర్, ముజాయిద్పూర్, మరికల్, కొత్తపల్లి తదితర గ్రామాల పరిధిలో బట్టీలు అధికంగా ఉన్నాయి. ఇక్కడికి మహబూబ్‌నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి వలస కూలీలు వస్తారు. వీరే కాకుండా ఒడిశా నుంచి కూడా అనేక కుటుంబాలు పిల్లలతో వస్తాయి. ఇక్కడ సుమారు 500 పైబడి కుటుంబా లు ఇటుక బట్టీల్లో పనిచేస్తాయి. ఈ పేదల పిల్లలు సుమారు 300 మంది వరకు బట్టీల వద్దే ఉంటున్నారు. కాస్తా ఎదిగిన వారు తల్లిదండ్రులతోనే పనిచేస్తుంటే.. చిన్నపిల్లలు గుడిసెల వద్ద గడిపేస్తారు. నిబంధనల ప్రకారం ఎక్కువ మంది వలస కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలోనే వలంటీర్‌ను ఏర్పాటు చేసి చదువు చెప్పించాల్సి ఉంటుం ది. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా ఒడిశా నుంచి వస్తున్న వారు ఇక్కడ దుర్బర జీవితాలను అనుభవిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉం టూ సరైన రక్షణ లేకుండా.. చాలీ చాలని వేతనాలతో పిల్లలకు సరైన ఆహారం కూడా అందించలేకపోతున్నారు. భార్యాభర్తలు రోజంతా కష్టపడితే రూ.300 వరకు వస్తా యి. ఇవి పూట గడిచేందుకు సరి పోతాయి కానీ పిల్లల సంరక్షణకు ఏమాత్రం సరిపోవు. వారంతా సుమారు ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటారు. దీంతో పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. బట్టీల యజమానులపై చర్యలేవీ? స్థానిక ఇటుక బట్టీల్లో చాలా మంది పిల్లలు పనిచేస్తున్నారు. పనిలో పెట్టుకుంటే శిక్ష లు ఉన్నా.. ఏ అధికారీ ఇటువైపు చూడడం లేదు. ఇక కాంట్రాక్టర్లు సైతం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కార్మికులకు చాలా తక్కువ మొత్తంలో చెల్లిస్తున్న వాళ్లు.. బయట మాత్రం వెయ్యి ఇటుకలను రూ.3,500 వరకు అమ్ముకుంటున్నారు. నిజానికి ఇటుక బట్టీల నిర్వహణకు అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్క డ నిర్వహిస్తున్న ఏ బట్టీకి అనుమతి లేదు. ఇక బట్టీలన్నీ ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్నాయి. సాగుకు మాత్రమే ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను కూడా వీరు వాడేస్తున్నారు. ఆరు నెలలపాటు ఇక్కడే ఉంటాం ఇక్కడికి వచ్చి నెల రోజులు అవుతోంది. మరో ఐదు నెలలు ఉంటాం. ఇక్కడ ఇచ్చే డబ్బులు మేం ఉంటానికే సరిపోవు. ఇక పిల్లలను ఏం చదివిస్తాం. మేం ఇక్కడికి వచ్చి పిల్లలను అక్కడ ఎవరి దగ్గర ఉంచాలి. - రాజు, ఒడిశా కూలీ పిల్లలను చదివించాలని ఉంది మాకూ పిల్లలను చదివించాలనే ఉంది. కానీ ఎలా? ఇక్కడ సౌకర్యాలు ఏమీ లేవు. ఆరు నెలలు ఊళ్లో ఉంటాం. మరో ఆరు నెలల ఇక్కడుంటాం. అందుకే చదువు మాన్పించినం. కొంచెం ఎదిగిన తర్వాత మాతోపాటు పనికి వస్తరు. - రాకేష్, కూలీ అప్పట్లో మా నాన్న.. ఇప్పుడు మేం వచ్చాం మా నాన్న పదేళ్ల క్రితం వరకూ ఏటా ఇక్కడికి వచ్చి పనిచేసేవారు. ఇప్పుడు మేం వస్తున్నాం. ఏం చదువుకోలేదు. అక్కడ బతుకుదెరువు లేదు. అందుకే కుటుంబాలతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. చదువుకోవాలంటే పైసలు కావాలే. తినడానికే లేవు.. చదువుకు ఎక్కడ్నుంచి వస్తయి. - మనప్ప, మహారాష్ట్ర మా పిల్లలూ పనిచేస్తరు.. ఇటుక బట్టిలలో నాతో పాటు నా ఇద్దరు పిల్లలు ఇక్కడే పనిచేస్తున్నాం గతంలో నేను, నా భార్య పనిచేసేవాళ్లం. అనారోగ్యం కారణంగా నా భార్య పనిచేయడం లేదు. మా పిల్లలు పనిచేస్తున్నారు. మాకు పట్టిన గతే మా పిల్లలకు పట్టేలా ఉంది. - తిమప్ప, గద్వాల్ చదివిస్తే బానే ఉంటది.. కానీ మా పిల్లలను చదివిస్తే బానే ఉంటది.. కానీ ఎలా చదివించాలి. మేం ఉన్న ఊళ్లో ఉంటే పూట గడవదు. వస్తే పిల్లల చదువులు పోతయి. అందుకే బడికి తోలట్లే. మాకు దగ్గర్లో ఎవరితోనైనా చదువు చెప్పిస్తే పిల్లలను పంపుతం. - రోహిత్, ఒడిశా కూలీ చదువు చెప్పిస్తాం.. పనిచేసే దగ్గర పాఠశాల ఏర్పాటు చేయాలని జీఓ ఉంది. కుల్కచర్ల మండలంలో ఇటుక బట్టీల దగ్గర పిల్లలు ఉంటే సర్వే చేయాలని ఎంఆర్సీలకు చెప్పాం. సర్వే చేస్తున్నారు. పిల్లలు ఉంటే అక్కడే పాఠశాల ఏర్పాటు చేసి వలంటీర్‌ను నియమిస్తాం. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. - నర్సింహులుగౌడ్, మండల విద్యాధికారి, కుల్కచర్ల -
రెండేళ్లుగా నష్టాలే
అద్దంకి, న్యూస్‌లైన్: ఇటుకల తయారీకి పేరెన్నికగన్న అద్దంకి ప్రాంతంలో ఆ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి కాల్చిన ఇటుకకు డిమాండ్ లేక తయారీ ధరకన్నా తక్కువ ధరకు విక్రయిస్తూ ఇటుకల పరిశ్రమల యజమానులు రెండేళ్లుగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఇంకా ధర వస్తుందని ఆశించి ఇటుకలు నిల్వ చేసిన యజమానులు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుల వడ్డీలు కొండలా పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితం అద్దంకి ప్రాంతంలో 250 బట్టీలుండగా.. ప్రస్తుతం 150 మాత్రమే మిగిలాయి. వీటిలో రూ. 15 కోట్ల ఇటుకల నిల్వలున్నాయి. దీంతో ఈ బట్టీల్లో పనిచేసే 10 వేల మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. అద్దంకి ప్రాంత ఇటుకకు రాష్ట్రంలోనే మంచి పేరుంది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అద్దంకి ప్రాంతానికి వచ్చిన వారు అద్దంకి, తిమ్మాయపాలెం, రామాయపాలెం గ్రామాల్లో 25 ఏళ్ల నుంచి ఇటుక బట్టీలు నడుపుతున్నారు. ఒకటి రెండు బట్టీలతో ప్రారంభమైన ఇటుక పరిశ్రమ క్రమంగా వృద్ధి చెంది 250 బట్టీలకు పెరిగింది. ఒక్కో బట్టీ ఏర్పాటుకు రూ. 15 నుంచి రూ. 25 లక్షల వరకు పెట్టుబడి అవసరం. ఒక్కో బట్టీకి ఇటుక కోసేందుకు, కుంది వేసేందుకు, బట్టీ పేర్చేందుకు 80 నుంచి 100 మంది కూలీలు అవసరమవుతారు. ఇటుక కోతకు శ్రీకాకుళం, ఉభయగోదావరి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి ఒక్కో జత(ఇద్దరు కూలీలు)కు రూ. 1.50 లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొస్తుంటారు. వీరు కుటుంబాలతో బట్టీ వద్దకు వలస వస్తారు. ఏటా డిసెంబర్ మొదటి వారంలో వచ్చి బట్టీ పనిచేసి మార్చిలో సొంత గ్రామాలకు వెళ్తారు. వీరికి ఇదే ప్రధాన ఉపాధి. ఇటువంటి వారు ఒక్కో బట్టీలో సుమారు 30 మంది వంతున మొత్తం 7 వేల మంది ఉంటారు. స్థానికంగా ఇతర పనులు చేసే వారు మరో 15 వేల మంది ఉంటారు. రెండేళ్లుగా గృహ నిర్మాణాలు తగ్గుముఖం పట్టడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా చేయకపోవడంతో ఇటుకలకు డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం ఇటుక పరిశ్రమ నష్టాల్లో ఉండటంతో వంద బట్టీల వరకు తగ్గిపోయాయి. దీంతో పది వేల మంది ఉపాధి కోల్పోయారు. తక్కువ ధరకే విక్రయిస్తూ... ఇటుకల తయారీకి కావాల్సిన ముడిసరుకులు వరిపొట్టు, మట్టి, వరిపొట్టు బూడిద ధరలు పెరగడంతో వెయ్యి ఇటుకలను రూ. 3,100కు విక్రయిస్తే గిట్టుబాటవుతుంది. కానీ బట్టీల యజమానులు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగకుండా తీర్చేందుకు రూ. 2,700కే విక్రయిస్తున్నారు. దీంతో పెట్టుబడి నష్టాలు తప్పడం లేదు. రెండేళ్ల క్రితం వెయ్యి ఇటుక ధర రూ. 3,400 ఉండేది. అప్పుడు గిట్టుబాటు ధర రూ. 2,500. ప్రస్తుతం 150 బట్టీల్లో మొత్తం 15 కోట్ల ఇటుకల నిల్వలున్నాయి. వీటి విలువ రూ. 45 కోట్లు ఉంటుంది. మళ్లీ ఇటుక బట్టీల సీజను వస్తుండటంతో నిల్వ ఉన్న ఇటుకను ఏం చేయాలి? కూలీలకు ఎలా పనిచూపాలని బట్టీల యజమానులు మీమాంసలో పడ్డారు. ముంచిన రియల్ ఎస్టేట్... అద్దంకి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు ఇటుక బట్టీల యజమానులు గతంలో తమకు వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితుల్లేక ఏంచేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు.