విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు రైల్వేజోన్‌పై చేసిన కుట్రపూరిత ప్రకటనను సీపీఎం తీవ్రంగా ...
ఎంపీ హరిబాబు ప్రకటనపై సీపీఎం నిరసన
డాబాగార్డెన్స్: విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు రైల్వేజోన్‌పై చేసిన కుట్రపూరిత ప్రకటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడానికి చాలా అవరోధాలు, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం నగర కార్యదర్శి మాట్లాడుతూ మొన్నటి వరకు అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ప్రకటనలు గుప్పించిన ఎంపీ హరిబాబు చావు కబురు చల్లగా చెప్పినట్టు విశాఖకు రైల్వేజోన్ రాదని పరోక్షంగా వెల్లడించారన్నారు. రైల్వేజోన్‌పై వేసిన కమిటీ విశాఖకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పడం వెనుక ఎంపీ కుట్ర ఉందన్నారు.
చట్టంలో రైల్వేజోన్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్న తర్వాత రైల్వేజోన్ ప్రకటించకుండా తీవ్ర జాప్యం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నామన్నారు. ఇది బీజేపీ-టీడీపీ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం విశాఖలో పెట్టి విశాఖకు రైల్వేజోన్ రాకుండా కుట్రకు పాల్పడినట్టు అర్థమవుతోందన్నారు. విశాఖకు అన్యాయం చేసే చర్యలను ప్రతిఘటిస్తామని, అమరావతికి రైల్వేజోన్‌ను తరలించే కుట్రలను బీజేపీ-టీడీపీ నాయకులు ఉపసంహరించాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.మణి, పార్టీ నగర కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, అప్పారావు, నరేంద్రకుమార్, డి రాజు, నూకరాజు, నాయుడు, రమణ, భూలోకరావు, కుమారి, విజయ తదితరులు పాల్గొన్నారు.