జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మంగినపూడి బీచ్ టోల్‌గేట్ నిర్వహణను దక్కించుకునేందుకు ఓ తెలుగుదేశం కార్యకర్త చేస్తున్న ప్రయత్నం వివాదానికి దారితీసింది.
- దక్కించుకునేందుకు యత్నం
- పర్యాటకశాఖ సిబ్బందిపై దౌర్జన్యం
- నగదు, రశీదు పుస్తకం లాక్కున్న వైనం
- పోలీసులకు అధికారుల ఫిర్యాదు
మచిలీపట్నం : జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మంగినపూడి బీచ్ టోల్‌గేట్ నిర్వహణను దక్కించుకునేందుకు ఓ తెలుగుదేశం కార్యకర్త చేస్తున్న ప్రయత్నం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీచ్ నిర్వహణ ప్రస్తుతం పర్యాటకశాఖ అధీనంలో ఉంది. టీడీపీ కార్యకర్త రెండురోజుల కిందట టోల్‌గేట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి, నగదు, రశీదు పుస్తకాలు లాక్కున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఉన్న విజయవాడ సబ్ కలెక్టర్ ఎ.నాగలక్ష్మి ఆదేశం మేరకు మచిలీపట్నం ఆర్డీవో ద్వారా టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు చేయడానికి రెండురోజుల సమయం పట్టింది. వివరాలిలా ఉన్నాయి.
బందరు మండలం తాళ్లపాలెం పరిధిలో ఉన్న మంగినపూడి బీచ్‌లో ఆరు నెలల కిందటి వరకు ఆ గ్రామ పంచాయతీ ద్వారానే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీచ్ నిర్వహణను పర్యాటకశాఖకు అప్పగించారు. టోల్‌గేట్ ద్వారా ఏడాదికి సరాసరిన రూ. 3 నుంచి రూ.4 లక్షల రుసుము వసూలవుతోంది. ప్రస్తుతం ఇక్కడ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో టోల్‌గేట్ రుసుము వసూలు చేస్తున్నారు.
టోల్‌గేట్‌ను దక్కించుకునేందుకు టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడు నాగరాజు పథకం రచించాడు. దీనిని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల క్రితం బీచ్ వద్దకు వెళ్లి టోల్‌గేట్ రుసుము వసూలు చేస్తున్న సిబ్బంది నుంచి కొంత నగదు, రశీదు పుస్తకాలను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది విజయవాడ సబ్‌కలెక్టర్ ఎ.నాగలక్ష్మికి తెలియజేశారు. ఇక్కడ నుంచే అసలు కథ ప్రారంభమైంది.
టీడీపీ నాయకుల ఒత్తిళ్లు
విజయవాడ సబ్‌కలెక్టర్ బందరు ఆర్డీవోకు ఫోన్ చేసి ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పదేపదే కోరినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారాన్ని కప్పిపెట్టేందుకు టీడీపీ నాయకులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. మా కార్యకర్త పైనే ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా* అంటూ మచిలీపట్నంకు చెందిన ఓ టీడీపీ నాయకుడు అధికారులను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు బందరు ఆర్డీవో మంత్రి వద్దకు వెళ్లి వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. విజయవాడ సబ్‌కలెక్టర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవటంతో అధికారులు ఓ మెట్టు దిగివచ్చారు. నాగరాజుపై మంగళవారం రాత్రి బందరు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని తాలుకా ఎస్సై ఈశ్వర్ సాక్షి* వద్ద నిర్ధారించారు. దీనిపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీచ్ అభివృద్ధిని పాలకులు పక్కనపెట్టి టోల్‌గేట్‌ను దక్కించుకునేందుకు తెరవెనుక మంత్రాంగం నడపటం.. పర్యాటకశాఖ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయటం వివాదాస్పదమైంది.