ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణ మాఫీ మెలికల కారణంగా బ్యాంకు రుణాలకు రైతులు దూరమయ్యారు.
* చంద్రబాబు నిర్వాకంతో పడిపోయిన బ్యాంకు రుణాలు
* రుణ మాఫీపై చంద్రబాబు సర్కారు మెలికలతో ఏపీ రైతులకు అప్పుల తిప్పలు
* ఈ ఏడాది రుణాల లక్ష్యంలో నాలుగో వంతైనా ఇవ్వలేకపోయిన బ్యాంకర్లు
* ఖరీఫ్, రబీ రుణ లక్ష్యం రూ. 56,019 కోట్లు.. ఇచ్చింది రూ. 13,789 కోట్లే
* గత ఏడాది ఇదే సమయానికి రుణ లక్ష్యంలో 57.26 శాతం పంపిణీ
* కౌలు రైతుల పరిస్థితి దారుణం.. రూ. 58.87 కోట్లే పంట రుణం
* మహిళా సంఘాలకు రుణ లక్ష్యం రూ.13 వేల కోట్లు.. ఇచ్చింది 2 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణ మాఫీ మెలికల కారణంగా బ్యాంకు రుణాలకు రైతులు దూరమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సర్కారు ఇప్పటికి కూడా రైతుల రుణాల మాఫీ చేయకపోవడంతో.. బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేయడం లేదు. ఖరీఫ్ ముగిసిపోయి రబీ వచ్చినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. బ్యాంకులు గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసేవి. అలాంటిది ఇప్పుడు నిర్దేశించుకున్న వ్యవసాయ రుణ లక్ష్యంలో నాలుగో వంతైనా ఇవ్వలేకపోయారు.
రుణ మాఫీ మాట దేవుడెరుగు.. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌లో రైతుల రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ బ్యాంకులకు విడుదల చేయలేదు. అంతేనా.. కౌలు రైతులకు కానీ, మహిళా సంఘాలకు కానీ ఈ ఏడాది బ్యాంకుల నుంచి అందిన రుణాలు నామమాత్రంగానే ఉన్నాయి. చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డుల జారీ పరిస్థితి కూడా అంతే. ఇక చేతి వృత్తుల సంఘాలకు, బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా మార్జిన్ మనీ పథకం, మత్స్యకారులకు రుణాలు వంటివేవీ ఈ ఏడాది ఒక్క పైసా కూడా ఆయా వర్గాలకు అందలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన 188వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. ఆ వివరాలివీ...
లక్ష్యంలో పావు వంతైనా ఇవ్వలేదు..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలో కలిపి వ్యవసాయ రంగానికి 56,019 కోట్ల రూపాయలు రుణాలుగా మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ. 13,789 కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలుగా మంజూరు చేశాయి.
ఖరీఫ్ రుణాలు సగమైనా అందలేదు..: ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ. 25,888 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఖరీఫ్ ముగిసే నాటికి కేవలం రూ. 10,108 కోట్లు బ్యాంకులు మంజూరు చేశాయి. చంద్రబాబు సర్కారు రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలను మంజూరు చేయడం లేదు.
కౌలు రైతులకు ఇచ్చింది రూ. 58 కోట్లే..
కౌలు రైతులకు రుణ మంజూరు మరీ దారుణంగా పడిపోయింది. డిసెంబర్ 4వ తేదీ నాటికి 33,979 మంది కౌలు రైతులకు కేవలం రూ. 58.87 కోట్ల మేర రుణాలే మంజూరయ్యాయి.
ఈ రంగాలకు పైసా రుణమూ ఇవ్వలేదు...
చేతి వృత్తుల సంఘాలకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదు. పది చేతి వృత్తుల సంఘాలకు రూ. 669 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు.
రాష్ట్రంలో 2,349 మంది మత్య్సకారులకు రూ. 28.69 కోట్లు రుణంగాను రూ. 19.55 కోట్లు సబ్సిడీగాను ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు.
మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ ద్వారా బ్యాంకు పథకాలకు నిధుల విడుదలను రాష్ట్ర విభజన నేపథ్యంలో నిలుపుదల చేసినట్లు బ్యాంకర్ల సమితి సమావేశంలో పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఆర్థిక సహకార సంస్థల ద్వారా ఆయా వర్గాలకు రుణాలు మంజూరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది.
మహిళా సంఘాలకు ఐదో వంతే రుణాలు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలకు రూ. 13,791 కోట్లు రుణంగా మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా.. కేవలం రూ. 2,028 కోట్లే మంజూరు చేశారు.
31,339 మంది చేనేత కార్మికులకు క్రెడిట్ కార్డులు జారీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. కేవలం 2,116 మందికే కార్డులు జారీ చేశారు.
‘వడ్డీ’ సొమ్ము ఇవ్వని సర్కారు
చంద్రబాబు రుణ మాఫీ హామీతో చాలా మంది రైతులు రుణాలను చెల్లించకపోగా కొంత మంది మాత్రం రుణాలను సకాలంలో చెల్లించారు. అలాంటి రైతుల్లో లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుని తిరిగి సకాలంలో చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. లక్ష రూపాయలకుపైగా రుణం తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే పావలా వడ్డీ వర్తిస్తుంది. ఇలా తిరిగి చెల్లించిన వారికి బ్యాంకులు పావలా వడ్డీ, వడ్డీలేని నిధులను ఇవ్వాల్సిందిగా బ్యాంకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాయి. అయినా ప్రభుత్వంఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది.
బ్యాంకర్ల సమావేశం అంత గోప్యమా?
భేటీకి మీడియాను దూరం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనలో తనను మించిన వారు లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన తీరు అందుకు భిన్నంగా సాగింది. గతంలో జరిగిన సమావేశాలకు ఈసారి జరిగిందానికి పొంతనే లేకుండా పోయింది. వాస్తవానికి ఇది రొటీన్ సమావేశం. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మొదలు ఉన్నతాధికారుల వరకు అందరూ అదే మాట చెప్పినా గతానికి భిన్నంగా ఈసారి ఆ మీటింగ్ ఛాయలకే మీడియాను రానివ్వలేదు. అందరికీ అందజేసిన బ్యాంకు పత్రాలను గానీ, నివేదికను గానీ, చివరకు మాట్లాడిన అంశాలను గానీ మీడియాకు అందజేయలేదు.
ఒక్క చంద్రబాబు ప్రసంగాన్నే ప్రసారం చేసుకోవాలని మీడియా పాయింట్ వద్ద ట్రాన్స్‌మిషన్ ఏర్పాటు చేసి, అది పూర్తయిన వెంటనే కనెక్షన్‌ను తీసివేశారు. గతంలో మీటింగ్ హాలులో స్థలం లేకపోవడంతో మీడియాను ఐదో అంతస్తులోని సైబర్ గంగ హాలులో కూర్చోమని చెప్పి బ్యాంకర్ల సమితి ప్రచురించిన నివేదికలను అందజేశారు. ఈసారి అదీ లేదు. మీటింగ్‌లోకి వస్తామంటే అభ్యంతరం చెప్పారే తప్ప ఎటువంటి సమాచారాన్ని అందజేయకుండా గోప్యత పాటించారు.