ఆక్సిజన్‌ అందక బిడ్డ  మృతి

Baby Dead In PHC At Guntur - Sakshi

పీహెచ్‌సీ ఎదుట ఆందోళనకు దిగిన బంధువులు

మంగళవారం తెల్లవారుజామున ఆస్పత్రికి వచ్చిన గర్భిణి

కాన్పు చేయించేందుకు యత్నించిన డ్యూటీ నర్స్‌  

సాక్షి, కారంపూడి : సకాలంలో వైద్యం అందక పురిటిలోనే శిశువు మృతి చెందిన ఘటన కారంపూడి పీహెచ్‌సీలో మంగళవారం జరిగింది. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన బి.మరియకుమారి పురిటినొప్పులతో బాధపడుతుండగా మంగళవారం తెల్లవారు జామున 108లో ఆమె బంధువులు కారంపూడి పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు. అక్కడ ఆమెకు సరైన వైద్యసేవలు సకాలంలో లభించలేదు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన డ్యూటీ నర్స్‌ కాన్పు చేయించే యత్నం చేశారు. ఈ క్రమంలో మరియకుమారి పురిటి నొప్పులతో రెండు గంటల పాటు అల్లాడిపోయింది. అలా మగళవారం తెల్లవారుజాము 3.30 నుంచి ఉదయం 5.30 వరకు బాధపడుతుండగా నర్స్, ఆయాలు కాన్పు చేయించేందుకు ప్రయత్నించారు. బయటకు పంపితే తాము నిర్లక్ష్యం చేశామని, ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళనతో అతికష్టం మీద కాన్పు చేశారు.

అయితే  కాన్పు తర్వాత బిడ్డకు ఆక్సిజన్‌ సరిగా అందడంలేదని 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అందించే యత్నం చేశారు. తర్వాత స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్‌ అప్పటికే శిశువు మృతి చెందినట్లు చెప్పారు. వాస్తవంగా శిశువును పిడియాక్ట్రిక్‌ డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లాలి. కారంపూడిలో ఆ డాక్టర్‌ లేరు. రాత్రి పూట వచ్చిన ఇలాంటి క్రిటికల్‌ కేసులు చూడటానికి డాక్టర్‌ స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీకి వచ్చిన డాక్టర్‌ దుర్గారావు మరియకుమారిని పరీక్షించి ఆమె ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆమె బంధువులతో ఆస్పత్రికి వచ్చి తన బిడ్డ మృతికి సరైన వైద్యసేవలు అందకపోవడమే కారణమని పీహెచ్‌సీ ముందు బైఠాయించింది. వాస్తవంగా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. అయినా ఇంటికి పంపారు. తర్వాత బంధువులు ఆందోళనకు దిగడంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

సిబ్బంది నిర్లక్ష్యమేనా..
డ్యూటీ నర్స్‌లు ఆస్పత్రిలో  ఉండకపోవడం చాలా కాలంగా జరుగుతోంది. అలాగే క్రిటికల్‌ కేసులు వచ్చినప్పుడు డాక్టర్లు అందుబాటులో లేకుండా వేరే పట్టణాలలో ఉంటుండంతో ఈ పరిస్థితి వచ్చింది. డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే డ్యూటీ చేస్తున్నారు. వాస్తవంగా వారు స్థానికంగా అందుబాటులో ఉండి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు చాడాలి. అయితే తాను డెప్యూటేషన్‌పై గుంటూరు జీజీహెచ్‌లో డ్యూటీలో ఉన్నానని వైద్యాధికారి బాలకిషోర్‌నాయక్‌ చెప్పారు. మరోవైపు బిడ్డ పుట్టగానే మృతి చెందిదని, ఈ విషయం తల్లికి బంధువులు తెలిస్తే ఎక్కడ గొడవ చేస్తారోనని ఆస్పత్రి సిబ్బంది నాటకం అడినట్లు తెలుస్తోంది. బాధితులు స్థానిక ఎస్‌ఐ రవికృష్ణకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top