అటల్‌జీ.. నిను మరువలేం..

Atal Bihari Vajpayee Memories in Visakhapatnam - Sakshi

వాజ్‌పేయి భారత‘రత్నమే’

ఉక్కును నిలబెట్టిన నేత పోర్టు సాగరమాలతో అనుసంధానం

ఏయూకు సైన్స్‌ విభాగాల విస్తరణ వైజాగ్‌పై వాజ్‌పేయి చెరగని ముద్ర

దేశం గర్వించే నేత..భాష పులకించిన కవి..దాయాదిదేశానికి సవాల్‌తో పాటుస్నేహాన్ని స్వాగతించిన ధీరోదాత్త ప్రధాని..ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం..ఆయన ప్రసంగం.. విలువైన పుస్తకం..
ఆయన నిర్ణయం.. దేశంలో మార్పునకు చిహ్నం..ఆయన రాజనీతి.. ఎందరికో దిక్సూచిఆయన మరణం.. ముగిసిన ఓ రాజకీయ శకంవ్యక్తిత్వానికి నిలువుటద్దంగా, నిస్వార్థ రాజకీయాలకు సరైన నిర్వచనంగా.. మానవతా విలువలకు అసలైన చిరునామాగా వెలుగొందిన వాజ్‌పేయి అస్తమించారన్న విషయం జీర్ణించుకోలేనిది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో, నీతి నిజాయితీలే అసలైన సిద్ధాంతాలుగా జీవించారు. విలువలన్నీ ఒకటైతే.. అతనే వాజ్‌పేయి అని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశంసించడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఆయన మరణవార్త విన్న విశాఖ విలపించింది. ఆయనతో పంచుకున్న జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటోంది.

సాక్షి, విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు.  విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్‌ వచ్చారు. ఇక్కడ  కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. 

స్టీల్‌ప్లాంట్‌కు రూ.1300 కోట్ల మూలనిధి : వాజ్‌పేయి 1998లో ప్రధానిగా ఉన్న సమయంలో స్టీల్‌ప్లాంట్‌కు రూ. 1300కోట్ల మూలనిధి ఇచ్చి ఆదుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, విశాఖ పోర్టుకు కనెక్టివిటీ రో డ్లు, నేవీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని అప్‌గ్రేడ్, యూనివర్సిటీల పటిష్టతలో భాగంగా ఏయూలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభా గాల స్థాపన వంటి వాటికి కృషి చేశారు.
విశాఖ బీచ్‌లో వాకింగ్‌ : వాజ్‌పేయికి విశాఖ బీచ్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రధాని కాకముందు వరకు వైజాగ్‌ వచ్చినప్పుడల్లా తోటి నాయకులతో బీచ్‌కు Ððవెళ్లేవారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసేవారు. వాకింగ్‌కు వీలు కాని పరిస్థితుల్లో కారులో సాగరతీరంలో షికారుకు వెళ్తామనేవారు. ఆయన అభీష్టం మేరకు కారులో బీచ్‌ తిప్పేవారు. సాగరతీరం, ప్రకృతి అందాలను చూసి వాజ్‌పేయి ఎంతో మురిసిపోయేవారని ఆయనతో సన్నిహితంగా గడిపిన పీవీ చలపతిరావు ‘సాక్షి’తో చెప్పారు.  ఆయన మృతికి బీజేపీ శ్రేణులు సంతాపం తెలిపాయి.

విశాఖలో గుండెపోటు.. కేజీహెచ్‌లో చికిత్స
అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో ప్రాణ సంబంధమైన అనుబంధం కూడా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో విశాఖ వచ్చినప్పుడు (దాదాపు 35 ఏళ్ల క్రితం) ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు పీవీ చలపతిరావు హుటాహుటిన కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజీ చీఫ్‌ డాక్టర్‌ సిన్హా ఆయనకు తక్షణ వైద్యం అందించారు. సోదరిగా పిలిచే చలపతిరావు సతీమణి అనూరాధ ఆస్పత్రిలో వాజ్‌పేయికి సపర్యలు చేశారు. రెండ్రోజుల విశ్రాంతి అనంతరం వాజ్‌పేయి ఢిల్లీ పయనమయ్యారు. అప్పట్నుంచి విశాఖ అంటే వాజ్‌పేయికి మరింత అభిమానం పెరిగింది.

ఒకే రూమ్‌లో ఉండే అరుదైన అవకాశం దక్కింది
వాజ్‌పేయితో అత్యంత సన్నిహితంగా మెలిగాను. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. వాజ్‌పేయి తొలిసారి 1961లో విశాఖలో పర్యటించారు.ఆ ఏర్పాట్లు నేనే  చేశాను. ప్రధాని హోదాలోనూ చాలా సార్లు పర్యటించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు  విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆయన అభినందించడం ఎవ్వరూ మర్చిపోలేని జ్ఞాపకం. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం ..ఇలా చాలా సార్లు సభలకు వాజ్‌పేయి హాజరయ్యారు. ఆయనకు విశాఖ చాలా ఇష్టం. ఆయన ఓసారి పుట్టిన రోజు వేడుకల్ని కూడా ఇక్కడ చేసుకున్నారు. శ్రీకాకుళం ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారానికి వాజ్‌పేయ్‌ కుశభావ్‌ ఠాక్రే కలిసి వచ్చారు. శ్రీకాకుళంలోని అతిథి గృహంలో ఒక గదిలో ఠాక్రే, మరో గదిలో వాజ్‌పేయి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయనతో కలిసి ఒకే రూమ్‌లో ఉండే అరుదైన అవకాశం లభించినందుకు చాలా గర్వంగా అనిపించింది.         – పీవీ చలపతిరావు, బీజేపీ సీనియర్‌ నేత

ఆయన ప్రసంగం కోసం సభకు వెళ్లాను
వాజ్‌పేయి ప్రసంగమంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి  ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగిన సభకు వాజ్‌పేయి హాజరయ్యారు. అప్పుటికి నేను రాజకీయాల్లోకి ఇంకా రాలే దు. కేవలం ఆయన ప్రసంగం వినాలని వచ్చి సభ ముగిసేవరకూ ఉన్నాను. ఆయనంటే అంత అభిమానం నాకు. ఉభయసభలకు 12 సార్లు పార్లమెంట్‌కు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. 1999లో ఒక్క ఓటు తక్కువ వచ్చి ప్రధాని పదవిని 13 నెలల్లోనే కోల్పోయారు. ఆ ఒక్క ఓటు ఉంటే ఐదేళ్లు పాలించేవారు. అయినా.. డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి ఎంపీల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. అదే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. హైవే విస్తరణ ప్లాన్‌లో మధురవాడ క్రికెట్‌ మైదానం కొంత రోడ్డులో కలిసిపోయింది. విషయం తెలిసి అప్పటిæ మేయర్‌ డీవీ సుబ్బారావుతో కలిసి ప్రధాని వాజ్‌పేయికి రిప్రజెంటేషన్‌ పంపించాం. ఆయన స్పందించి, ప్లాన్‌ మార్చడంతో.. ఇప్పుడా మైదానం అంతర్జాతీయ క్రికెట్‌కు వేదికైంది.  – విష్ణుకుమార్‌ రాజు, విశాఖ ఉత్తర  ఎమ్మెల్యే

విశాఖతో మధురానుబంధం
వాజ్‌పేయి తొలిసారి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు 1977లో ఆయన జన్‌సంఘ్‌ పార్టీ నాయకుని హోదాలో విశాఖలో అడుగుపెట్టారు.
1980లో బీజేపీ ఏర్పాటయ్యాక ఆయన 1982లో విశాఖ వచ్చారు.
1981లో జరిగిన ఎన్నికలలో విశాఖ మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను బీజేపీ 25వార్డులలో విజయభేరి మోగించింది. ఫలితంగా విశాఖ తొలి మేయర్‌గా ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. వాజ్‌పేయి అప్పట్లో  బీజేపీ మేయర్‌ ఎన్నికల విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌టౌన్‌లోని ప్రస్తుత జీవీఎంసీ స్టేడియం ఉన్న స్థలంలో పౌరసన్మానం చేశారు.
1983లో మరోసారి విశాఖ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు.
1997లో విశాఖ మేయర్‌ ఎన్నికల సమయంలో విశాఖ వచ్చారు. ఎన్నికల ప్రచారం చేసి వెళ్లారు.
వాజ్‌పేయికి 1988లో షíష్టిపూర్తి సందర్భంగా ఏయూ కాన్వొకేష¯Œన్‌ హాలులో ఘన సన్మానం చేశారు. వాజ్‌పేయి 1993లో భారత్‌ పరిక్రమ్‌ యాత్ర సందర్భంగా విశాఖ వచ్చారు. అప్పటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రస్తుత అధికార ప్రతినిధి పృథ్వారాజ్‌ ఆయనను కలుసుకున్నారు.
1998 సార్వత్రిక ఎన్నికల సమయంలో డీవీ సుబ్బారావు విశాఖ ఎంపీగా, పీవీ చలపతిరావు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిద్దరి తరపునా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
2004 ఎన్నికల సమయంలో కె. హరిబాబు వన్‌టౌన్‌ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంవీవీఎస్‌ మూర్తి పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ–బీజేపీ పొత్తు కారణంగా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top