చంద్రబాబు తీరు దారుణం

AP NGO Vice President Pasupuleti Srinivas Fires On Chandrababu - Sakshi

సాక్షి, కాకినాడ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్‌పై టీడీపీ నేత చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష సభ్యులు చేసిన దౌర్జన్యాన్ని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతిపక్ష నాయకులు చేసిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, దానికి బాధ్యులైన వ్యక్తులపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిని అనుచిత పదజాలమైన ‘బాస్టర్డ్‌’ అని తిట్టడం, వారిపై దాడి చేయడం, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర కేంద్ర కార్యాలయమైన అసెంబ్లీలోనే ఉద్యోగులపై దాడి చేస్తే సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులను వెనకేసుకు వచ్చి, అసెంబ్లీలోకి దౌర్జన్యంగా దూసుకెళ్లడాన్ని నియంత్రించి, నిబంధనల మేరకు పని చేసే ఉద్యోగులను తిట్టించడం, దాడికి దిగటం దారుణమని పేర్కొన్నారు. 

ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాడిన మాటలను చంద్రబాబునాయుడు వెంటనే ఉపసంహరించుకుని, ఉద్యోగ వర్గానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకన భావమేనని, ఉద్యోగులను హింసించే మనస్తత్వం ఆయనకు ఉందని అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం నిరంతం కష్టపడి పని చేసే ఉద్యోగుల జోలికి వస్తే ఉద్యోగ సంఘాలుగా తాము ఊరుకోబోమని హెచ్చరించారు. దొమ్మీగా అసెంబ్లీలోకి వచ్చే విధానాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అక్కడ పని చేసే మార్షల్స్‌పై ఉంటుందని, ఆ విషయం చంద్రబాబుకు తెలీదా అని ఆశీర్వాదం, శ్రీనివాస్‌ ప్రశ్నించారు. కింది స్థాయి ఉద్యోగులపై చంద్రబాబు చేసిన దౌర్జన్యానికి క్షమాపణ చెప్పాలని, ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో ఉండడం సరికాదని అన్నారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన చంద్రబాబు తీరును ప్రతి ఉద్యోగీ ఖండించాలని వారు పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top