అక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం బట్టబయలైంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆకస్మిక తనిఖీల పేరిట లక్షలు దండుకుంటున్న వైద్యశాఖ ఉన్నతాధికారి.. ఇప్పుడు సరికొత్త పథకంలో వసూళ్లకు తెరలేపారు. నగరానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని నగర శివారు ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో ఆస్పత్రులు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 1,150కి పైగా ప్రైవేటు ఆస్పత్రులు, 684 స్కానింగ్ కేంద్రాలున్నాయి. అయితే వీటిల్లో చాలావరకు అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి.
దీన్ని సాకుగా చేసుకున్న డీఎంహెచ్‌ఓ.. ఆకస్మిక తనిఖీలు చేస్తారు.. అప్పటికప్పుడు నోటీసులిస్తారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఆస్పత్రి యాజమాన్యం చేతులు తడిపితే చాలు.. మరుక్షణం ఆ నోటీసులు చెత్తబుట్టలో వేస్తారు.
చేతిరాత నోటీసులు.. చెత్తబుట్టపాలు..
సాధారణంగా ఓ ఆస్పత్రిని తనిఖీ చేయాలంటే అందుకు సంబంధించి ప్రత్యేక బృందం వెళ్లాల్సి ఉంటుంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా చేసే తనిఖీల్లో కేవలం డీఎంహెచ్‌ఓతోపాటు మరో క్లరికల్ స్థాయి అధికారి, మరో ఉద్యోగి ఉంటారు. ఆస్పత్రిలోని లోపాలను గుర్తించి అప్పటికప్పుడు నోటీసులిస్తారు. అక్కడే చేతిరాతతో ఈ నోటీసులు తయారు చేసి మరుక్షణం జారీ చేస్తారు. అయితే ఆస్పత్రి సిబ్బందితో ఒప్పందం కుదిరితే చర్యలకు మంగళం పాడడం.. లేదంటే వారిపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇటీవల ఉప్పల్ మండలం రామంతాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని రాత్రి సమయంలో సందర్శించిన డీఎంహెచ్‌ఓ.. ఆస్పత్రి యాజమాన్యానికి ఓ నోటీసు జారీ చేశారు. చివరకు యాజమాన్యంతో ‘మ్యాటర్’ సెటిల్ కావడంతో చర్యలకు మంగళం పాడేశారు.
ఉత్తుత్తి తనిఖీలే..
వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి చేపట్టే రోజువారీ ఆకస్మిక తనిఖీలు కేవలం క్షేత్రస్థాయి తనిఖీలు మాత్రమే. వాస్తవంగా రోజువారీ తనిఖీలు, జారీ చేసే నోటీసులు తన కార్యాలయంలో రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే తనిఖీల్లో భాగంగా నోటీసులు జారీ చేసినప్పటికీ.. చివరకు చేతులు తడిపితే ఆ వివరాలు కార్యాలయంలో రికార్డు కావు. ఇలా వందల సంఖ్యలో రికార్డు కాని నోటీసులున్నట్లు సమాచారం. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తే అసలు బాగోతం బయటపడే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.