నకిలీలకు అడ్డుకట్ట  

Agronomy Laboratory Established In Kadapa Over Fraud Seeds - Sakshi

జిల్లాలో వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటు 

రూ.7.29 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌  

ప్రయోగశాలలకు బాధ్యులుగా అసిస్టెంట్‌ డైరెక్టర్లు  

వ్యవసాయంలో నవశకం ఆవిష్కరించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు నాణ్యమైనవిత్తనం, పురుగుమందులు, ఎరువులు అందించడం.. భూసార పరీక్షల కోసం వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయపరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లాలోనిప్రతి నియోజక వర్గంలో వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్ష ప్రయోగశాలలనుఅందుబాటులోకి తీసుకొచ్చి రైతులనుఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు అన్ని విధాలా ఆలోచనలు చేస్తోంది. మరో రెండు నెలల్లో వారి కలలు సాకారం చేసేందుకు ముమ్మర చర్యలు తీసుకుంది.  

సాక్షి, కడప: గత ప్రభుత్వ హయాంలో రైతన్నలు స్వేదం ఎంత చిందించినా అందుకు తగ్గ ఫలితం ఉండేదికాదు. ఏ పంట సాగు చేసినా పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేకుండా పోయేది. విత్తనాల విషయంలో వరి, సజ్జ, కొర్ర, జొన్న, కంది, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేసినప్పుడు ఆ పంట కంకి తీసేవరకు ఎలాంటి లోపాలు కనిపించవు. కంకులు తీసే సమయంలో కంకి సైజు రాకపోవడం, అసలే కంకులు తీయకపోవడంతోనే నకిలీలు అని తెలిసేదని రైతులు చెబుతున్నారు. అలాగే పురుగు మందులు పిచికారీ చేసిన తరువాత పురుగులు ఏ మాత్రం చావకపోతే అప్పుడు ఆ మందుల్లో కల్తీ జరిగిందని తెలుసుకునేవారు. ఎరువులు కూడా నీటిలో కరిగినప్పుడు మాత్రమే అసలా? నకిలీవా? అని తేలేది. రైతులు  విత్తనాలు,  పురుగు మందులు నకలీవని తెలుసుకునేందుకు ఇప్పటి వరకు సరైన పరీక్షలు లేవు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికో వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం జిల్లాలో ఏ ప్రాంతాల్లో ప్రయోగశాలలకు అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి జూలై నెలలో వ్యవసాయశాఖ రాష్ట్ర అడినల్‌ డైరక్టర్‌ ప్రమీల పలు ప్రాంతాలను పరిశీలించారు. నివేదికలు సమరి్పంచారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగశాలల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసింది. జిల్లాలో 9 వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్ష ప్రయోగశాలల కోసం రూ.7.29 కోట్ల నిధులు మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

జిల్లాలో  విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వాడకం....:  
జిల్లాలో  ఖరీఫ్,  రబీ సీజన్లలో 3.67 లక్షల హెక్టార్లలో ఏటా పంటలను సాగు చేస్తున్నారు. ఇందుకుగాను1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 80 వేల క్వింటాళ్ల విత్తనాలను, మరో రూ.2.56 కోట్ల విలువ జేసే పురుగు మందులను వాడుతున్నారు. వీటిలో ఏది నకిలీనో? ఏది అసలైనవో? తెలుసుకునే పరిస్థితులు ఉండేవికావు.  హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించి ఫలితాలను తెలుసుకోవాల్సి వచ్చేది. ఇందులో ఏది నకిలీ అయినా రైతు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సందర్భంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్ష  ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది.  

9 ప్రయోగశాలల ఏర్పాటుకు సన్నాహాలు...: 
వైఎస్సార్‌ వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌ వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటుకు సంబంధించి స్థలాలను రాష్ట్ర అడినషల్‌ డైరెక్టర్‌ ప్రమీల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఎంపిక చేసిన ప్రయోగశాలలకు నీరు, విస్తరణ, విద్యుత్‌ సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక çసమరి్పంచారు.  2,112 చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ ప్రకారం రాజంపేటకు సంబంధించి ప్రయోగశాల నందలూరులోని మండల వ్యవసాయాధికారి కార్యాలయ ఆవరణలోను, రైల్వేకోడూరులోని పాత మండల వ్యవసాయాధికారి కార్యాలయ ఆవరణలో ఉన్న పాత ఎంపీడీఓ సమావేశ మందిరంలో, రాయచోటి, కమలాపురం, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల మార్కెట్‌యార్డులోను, మైదుకూరులో పశువుల దాణాకర్మాగారంలో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. కడపలోని ఊటుకూరు పాత జేడీ కార్యాలయ ఆవరణలో ఎరువుల ప్రయోగశాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగశాలల్లో మట్టిపరీక్షలు చేయించుకోవడంతోపాటు విత్తనాల నాణ్యతను పరీక్షించుకోవచ్చు. 

 నకిలీల ఆటకట్టించవచ్చు...: 
ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ప్రయోగశాలల వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతులు పరీక్షించుకోవడానికి మంచి అవకాశం. ఏ కంపెనీ నకిలీలు కట్టబెట్టినా వాటి ఆట కట్టించవచ్చారు. ఈ ప్రయోగశాలలు రైతులకు ఎంతగనో ఉపయోగపడతాయి.  
–పి.కృష్ణమూర్తి, రైతు, మావిళ్లపల్లె, మైదుకూరు మండలం. 

శుభ పరిణామం...: 
ఇప్పటి వరకు పంటల సాగు కోసం విత్తనాలను తీసుకొచ్చి విత్తుకునే వాళ్లం. అవి మొలకలు వచ్చి పూత, పిందె పడేవరకు నకిలీ విత్తనాలు అనే విషయం అర్థం అయ్యేదికాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో నకిలీలు లేకుండా చేయాలనే ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తుండడం శుభ పరిణామం.  –చెన్నయ్య, రైతు, పాలెంపల్లె, కడప నగరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top