రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతిల్లు కల సాకారం చేయాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం.
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతిల్లు కల సాకారం చేయాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం. కానీ నేడు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ తీరు ఇల్లు కట్టించడం సంగతి దేవుడెరుగు.. కట్టే ఇంటికి కన్నంపెట్టేలా ఉంది. ఇందిరమ్మ పథకానికి కొసరి కొసరి నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. వీటిలో నుంచే పేదల జేబుకు ఎలా కన్నమేయ్యాలా..?అని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే లబ్ధిదారుల బిల్లు నుంచి మినహాయించుకునేలా అడ్మినిస్ట్రేషన్ చార్జీలను అమాంతం మూడు రెట్లు పెంచేసింది.
ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారుల యూనిట్ విలువ నుంచే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను మినహాయించుకునేది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఇది నామమాత్రంగా ఉండేది. బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల యూనిట్ విలువలో అందరికీ సమానంగా రూ. 1,350 మాత్రమే కట్ చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని భారీగా పెంచడంతో ఇక ఇళ్లు ఎలా పూర్తవుతాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ యూనిట్ విలువ పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం బీసీ లబ్ధిదారులతో పోలిస్తే వీరి నుంచే ఎక్కువ మొత్తంలో అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు మినహాయించుకోవడం గమనార్హం.
పెంచిన చార్జీల ప్రకారం జిల్లాలోని వివిధ దశల కింద నిర్మాణంలో ఉన్న 21,277 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరయ్యే యూనిట్ విలువలో కోత పడనుంది. ఈ పథకంలో మూడు దశలు, జీఓలు 171, 33 కింద మంజూరైన ఇళ్లలో ఇవి ఉన్నాయి. లెంటల్ లెవల్, రూఫ్ లెవల్‌తో పాటు స్లాబు పూర్తయ్యే వరకు బీసీ లబ్ధిదారుల యూనిట్ విలువలో రూ. 4,200, ఎస్సీలకు రూ. 5,100, ఎస్టీలకు రూ. 5,250 మినహాయించుకుంటోంది. ఇటీవలే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో జిల్లాలో ఈ పథకం ఇప్పటి వరకు రెండు, మూడో దశల కింద ఇంకా మొదలుపెట్టని 53,668 ఇళ్ల చార్జీలలో కోత పడనుంది.
మహానేత ఆశయానికి కిరణ్ ప్రభుత్వం తూట్లు..
గుడిసె అనేదే ఉండరాదంటూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశించిన సంకల్పానికి కిరణ్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఇందిరమ్మ పథకానికి నిబంధనలు పెట్టి నిరుపేదలు గూడు కట్టుకోవాలన్న కలను సాకారం చేయలేకపోతోంది. వైఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల వారికి కలిపి కేవలం రూ. 1,350 మాత్రమే అడ్మినిస్ట్రేషన్ చార్జి కింద వసూలు చేశారు.
ఇప్పుడు ఇస్తున్న యూనిట్ విలువతో ఇళ్లు కట్టుకోవడం సాధ్య పడటం లేదని మరోవైపు లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇటుక, సిమెంట్, ఇసుక రేటు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే యూనిట్ విలువ సరిపోక అప్పుచేసి ఇళ్లు కట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సరిపోవడం లేదంటే ఇచ్చేదాంట్లోనే కోత పెడితే ఎలా..? అని మండిపడుతున్నారు. వైఎస్ ఉన్నప్పుడే మొదటి, రెండు, మూడో దశల కింద జిల్లాలో సుమారు రెండు లక్షల ఇళ్ల వరకు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం మూడో దశలో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సహాయంలో ఇలా కొర్రీలు పెట్టడం వల్లే ఈ పథకం కింద ఇళ్లు కట్టుకోడం భారమవుతోందని నిరుపేదలు అంటున్నారు.