‘టీడీపీ ప్రచురించిన పుస్తకంలో ఆరోపణలు అవాస్తవాలు’

Additional DG Ravi Shankar Ayyanar: Fake Alligations In TDP  Book - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కావాలనే పనికట్టుకొని ఓ రాజకీయ పార్టీ పోలీసులపై దుష్ప్రచారం చేస్తోందని అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రచురించిన పుస్తకంలోని పోలీసు కేసులకు సంబంధించిన విషయాలు సత్యదూరమని ఆయన కొట్టిపారేశారు. పల్నాడులో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని ఆరోపణలు చేయడంతోపాటు పోలీసులపై కూడా ఆరోపణలు చేసిందని డీజీ అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎనిమిది హత్యలు జరిగినట్లు ఆరోపణలు చేశారని, అవన‍్నీ రాజకీయ హత్యలు కావని అన్నారు. రౌడీ గ్రూపులు దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు చనిపోయారని.. అది కూడా ఎన్నికల ముందు జరిగిందని అదనపు డీజీ స్పష్టం చేశారు. 

దీంతోపాటు 110 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆరోపించిన దానిలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అవి కూడా రాజకీయ కేసులు కావని అన్నారు. మరో ఆరోపణలో 38 ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు కాలేదని అన్నారని, అవి కూడా అవాస్తవాలేనని తెలిపారు. అయితే ఎన్నికల ముందు నమోదైన 10 కేసుల్లో 70 మంది వైఎస్సార్సీపీ, 41 మంది టీడీపీకి చెందిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇవి కూడా కొత్త ప్రభుత్వం రాకముందే జరిగాయని గుర్తు చేశారు. అదే విధంగా ఆత్మకూరు మండలం నుంచి 545 మంది గ్రామ విడిచి వెళ్లిపోయారని ఆరోపించారని.. కానీ పనులు కోసం కేవలం 345 మంది మాత్రమే బయటకు వెళ్లారని.. అందులో 312 మంది కూడా వెనక్కి తిరిగి వచ్చారని వివరించారు. ఎవరూ భయబ్రాంతులకు గురై గ్రామం విడిచి వెళ్ళలేదని, ఎవరైనా ఆ ఊరు వెళ్లి పరిశీలన చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ 297 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 161 అవాస్తవమని తమ విచారణలో తేలిందన్నారు. 126 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.

గుంటూర్‌ రేంజ్‌ ఐజీ వినిత్‌ బ్రిజలాల్‌ మాట్లాడుతూ.. ‘పోలీసులకు రాజకీయ రంగు వేయొద్దని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ నేతలు రెండు బ్రోచర్లు వేసి డీజీపీకి ఇచ్చారు. ఈ ఆరోపణలు వాస్తవం కాదు. పల్నాడులో పరిస్థితి చక్కదిద్దేదుకు పోలీసు విభాగం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలపై పోలీసు విభాగం స్పందించదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. విధి నిర్వహణలో పోలీసు అధికారుల ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్‌ 353 కింద కేసులు నమోదు చేస్తాం. విధి నిర్వహణ లో పోలీసులు ఎలాంటి భావోద్వేగాలతో ఉండరని గుర్తించాలి’ అని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top