రంగస్థల నటుడు ఆచంట కన్నుమూత | ACHANTA stage actor passes away | Sakshi
Sakshi News home page

రంగస్థల నటుడు ఆచంట కన్నుమూత

Nov 26 2015 1:48 AM | Updated on Sep 3 2017 1:01 PM

ప్రఖ్యాత రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నంనాయుడు (81) బుధవారం మృతిచెందారు.

విజయవాడ (వన్‌టౌన్) : ప్రఖ్యాత రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నంనాయుడు (81) బుధవారం మృతిచెందారు. తెలుగు పౌరాణిక నాటక రంగానికి ఆయన విశేషమైన సేవలందించారు. కృష్ణాజిల్లాకు చెందిన ఆచంట రాష్ట్ర ప్రభుత్వం నుంచి హంస పురస్కారం, నందమూరి తారక రామారావు స్మారక పురస్కారాలను అందుకున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని తనయుడు ఆచంట   బాలాజీనాయుడు వద్ద ఉంటున్న వెంకటరత్నంనాయుడు బుధవారం తాడేపల్లిగూడెంలో కుమార్తెను చూడడానికి వెళ్లి అక్కడే మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే పలువురు రంగస్థల ప్రముఖులు, కళాభిమానులు ఇబ్రహీంపట్నం వెళ్లారు.
 
అభినవ దుర్యోధనుడిగా..
అభినవ దుర్యోధనుడిగా కీర్తి పొందిన ఆచంట వెంకటరత్నంనాయుడు ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలను అందుకున్నారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన కళావైశిష్ట్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. తెలుగు నాట దుర్యోధనుడి పాత్రకు జీవం పోసిన ఏకైక రంగస్థల నటుడిగా ఆచంట పేరు తెచ్చున్నారు.
 
వంద పాత్రల్లో నటించిన ఘనత

 ఆచంట తెలుగు రంగస్థలంపై పౌరాణిక, చారిత్రక నాటకాలకు సంబంధించి సుమారు వందకు పైగా పాత్రలను పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా దుర్యోధనుడు, భీముడు, గయుడు, అశ్వత్థామ తదితర పాత్రలను విశేషంగా పోషించారు. ప్రధానంగా జరాసంధుడి పాత్ర ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చింది. ఆచంట వెంకటరత్నంనాయుడు ప్రతినాయక పాత్రలో కూడా ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు. ఆయన షణ్ముఖ నాట్యమండలిని స్థాపించి నాటక రంగానికి మరింత శోభను తీసుకొచ్చారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో తులసీజలంధర, మైరావణ, కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయాలు తదితర పలు నాటకాలను తయారుచేసి దేశ వ్యాప్తంగా ప్రదర్శించారు. అమెరికా, సింగపూర్ లోనూ ప్రదర్శనలిచ్చారు.

ఎన్నో పురస్కారాలు, మరెన్నో సత్కారాలు
ఆచంట వెంకటరత్నం నాయుడు కళా వైదుష్యాన్ని మెచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అనేక సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించాయి. రాష్ట్రపతి పురస్కారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2000వ సంవత్సరంలో హంస పురస్కారాన్ని, ఆ తరువాత ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు పలు విశ్వవిద్యాలయాలు   ఆయనను సత్కరించాయి. రాష్ట్రపతి నుంచి పలువురు ప్రధానులు, పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు ఆయనను ఉచిత రీతిన గౌరవించి సత్కరించారు. తెలుగు భాషా వికాసానికి సైతం ఆచంట పాటుపడ్డారు. పద్యం కేవలం తెలుగువారికి మాత్రమే సొంతమని ఆయన దాని విశిష్టతను చాటుతూ భాషావ్యాప్తికి కృషిచేశారు.

తండ్రి బాటలోనే తనయుడు
ఆచంట వెంకటరత్నంనాయుడు బాటలోనే ఆయన తనయుడు ఆచంట బాలాజీనాయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. షణ్ముఖ నాట్యమండలి సంస్థను ఆయన నిర్వహిస్తూ పలు నాటకాలను తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా తండ్రి పోషించిన పాత్రలను  బాలాజీనాయుడు పోషించి మెప్పిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement