ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు 

25 Lakh House Land Pattas To Be Distributed On Ugadi - Sakshi

రెవెన్యూ అధికారులతో ఇన్‌చార్జి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ 

సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చే లక్ష్యంలో భాగంగా వచ్చే ఉగాది రోజున 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ దస్తావేజులతో కూడిన పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సీసీఎల్‌ఏ, ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  

ఈ కార్యక్రమం కోసం గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 22 లక్షల వరకూ లబ్ధిదారుల గుర్తింపు పూర్తయ్యిందని, మిగిలిన లబ్ధిదారుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్న భూములేమిటనేది గుర్తించాలన్నారు.

లిటిగేషన్‌లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించి ఆ భూములను కూడా ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీ మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను, వివిధ పట్టణాభివృద్ధి సంస్థల వద్ద ఇళ్ల స్థలాలకు ఉద్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని కోరారు.

రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేటాయించిన భూములను, భూదాన భూముల స్థితిగతులను కూడా తెలుసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరినారాయణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకూ 23,180 ఎకరాల భూమిని గుర్తించామని, ఇంకా అవసరమైన భూమిని త్వరగా గుర్తించాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top