ఏలూరు : జిల్లాలోని 16వేల ఎకరాల అటవీ భూములను పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏలూరు : జిల్లాలోని 16వేల ఎకరాల అటవీ భూములను పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ భూములను గుర్తించి రెవెన్యూ భూములుగా డీ-నోటిఫై చేయటం ద్వారా పరిశ్రమలకు కేటాయించాలని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సర్కారు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అటవీ భూముల స్థితిగతులపై రెవెన్యూ, అటవీ శాఖ రికార్డులతో సరిపోల్చే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ సర్వే చేయిస్తోంది. ఈ బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది.
అడుగడుగునా ఆటంకాలే
అటవీ భూములను రెవెన్యూ భూములుగా డీ-నోటిఫై చేసేందుకు సాగిస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. చాలాచోట్ల భూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. వేలాది ఎకరాల భూములకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ సర్వేకు వెళుతున్న అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లో ఈ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. నల్లజర్ల మండలలో 540 ఎకరాల అటవీ భూమిలో వనసరంక్షణ సమితులు వివిధ రకాల తోటలను సాగు చేస్తు న్నాయి.
ఇందులో 480 ఎకరాల అస్సైన్డ్, 60 ఎకరాల జిరాయితీ భూములు ఉన్నాయి. ఈ భూములను పారిశ్రామిక అవసరాల కోసం సేకరించాలనే నిర్ణయాన్ని సాగుదారులు వ్యతిరేకిస్తున్నారు. సర్వేకు వచ్చిన బృందాలను వారంతా అడ్డుకున్నారు. గతంలో కొండలు, వాగుల రూపంలో ఉన్న అస్సైన్డ్ భూములను తామంతా సాగుకు యోగ్యంగా మలుచుకున్నామని, ఇందిర జలప్రభ కార్యక్రమంలో బోర్లు వేసి మొక్కలు నాటామని సాగుదారులు చెబుతున్నారు. ఫలసాయం చేతికొచ్చే సమయంలో ఆ భూములను పరిశ్రమలకు ఇచ్చేయాలని అడిగితే తమ పరిస్థితి ఏమిటని రైతులు నిల దీస్తున్నారు.
సేకరణ సాధ్యమేనా?
జిల్లాలోని నాలుగు అటవీ రేంజ్‌ల పరిధిలో 81వేల 152 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇటీవల కుకనూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని 47,676 హెక్టార్ల అటవీ భూమి కూడా జిల్లాలో కలిసింది. దీంతో కలిపి జిల్లాలో మొత్తంగా సుమారు 1.49 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉంది. కాగా, చాలా మండలాల్లో అటవీ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. గిరిజనులకు చెందాల్సిన భూములు సైతం గిరిజనేతరుల చేతుల్లో చిక్కాయి. టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెంలో 250 ఎకరాలకు పైగా అటవీ భూమిని కొందరు దర్జాగా ఆక్రమించుకుని అరటి తోటలు సాగు చేస్తున్నారు. దీనిపై రాజుకున్న చిచ్చు నేటికీ ఆరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ భూములను రెవెన్యూ భూములుగా డీ-నోటిఫై చేసి పరిశ్రమలకు కేటాయించడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా, అటవీ భూములను డీ-నోటిఫై చేసే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనేది తమకు తెలియదని జిల్లా అటవీ శాఖ అధికారి పీఏ శ్రీనివాసశాస్త్రి చెప్పారు.