
హైదరాబాద్: ఆపరేష్ సిందూర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం.
‘అన్ని శాఖలు పూర్తి గా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతా పరమైన చర్యలు చేపట్టాలి.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత కల్పించాలి. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి’ అని సూచించారు.
సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ
భారత సైన్యానికి సంఘీభావంగా రేపు(గురువారం) సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిపైన సైతం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు చర్చించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం, డిప్యూటీ సీఎంలు. భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు.