సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బండి భగీరథ్ కేసు విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఈ కేసులో ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో విషయమై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ తండ్రి తప్పుచేయనప్పుడు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘బండి భగీరథ్ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన తప్పుచేస్తే పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మా మంత్రి తప్పు చేస్తే మాది బాధ్యత. ముందస్తు బెయిల్ తీసుకోవడం హక్కు. ఆయన పారిపోలేదు. బెయిల్ పెండింగ్లో ఉంది. అనంతరం, భగీరథ్ సరెండర్ అయ్యాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్తే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు చేసి భగీరథ్, ఆయన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేతలకు ఏ పని లేనట్టు బండి భగీరథ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం సరికాదు. ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఉన్నాడని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ వాళ్లు ముందుగానే కోర్టుకు ఎందుకు వెళ్లారు?. ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్ ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా?. మీ బీఆర్ఎస్ హయాంలో మహిళలపై దాడులు ఎన్నో జరిగాయి. పబ్లో ఎంఐఎం నేత కొడుకు అత్యాచారం చేయలేదా? ఏం చేశారు. కొమురం భీం జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. గతంలో లంబాడా అమ్మాయి మీద కస్టోడియల్ డెత్ జరగలేదా?. గతంలో మీ పాలనలో అత్యాచారాలు జరిగితే మరి కేసీఆర్ రాజీనామా చేశారా?. కాళేశ్వరం, కారు రేసు కేసులో త్వరగా విచారణ జరిగేలా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవాలి. మోదీ సభ విజయంతో తెలంగాణ ప్రజల బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని వ్యాఖ్యలు చేశారు.


