‘ఫిక్సింగ్‌ గురించి.. సచిన్‌, ద్రవిడ్‌లను పదే పదే అడిగాను’ | Tujhe Kisi Ne Poocha For Fixing: Ganguly recalls asking Sachin, Dravid | Sakshi
Sakshi News home page

‘ఫిక్సింగ్‌ గురించి.. సచిన్‌, ద్రవిడ్‌లను పదే పదే అడిగాను’

May 18 2026 12:03 PM | Updated on May 18 2026 12:10 PM

Tujhe Kisi Ne Poocha For Fixing: Ganguly recalls asking Sachin, Dravid

భారత క్రికెట్‌ సంధి దశలో ఉన్న వేళ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు సౌరవ్‌ గంగూలీ. సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అజారుద్దీన్‌ వంటి సీనియర్లు ఉన్న జట్టుకు నాయకత్వం వహించి.. విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై సారథిగా సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.

అయితే, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో డ్రెసింగ్‌రూమ్‌లో సీనియర్లకు దిశానిర్దేశం చేసే విషయంలో గంగూలీ ఇబ్బందిపడ్డాడు. అదే విధంగా.. తాను సారథిగా వచ్చే ముందు చోటు చేసుకున్న ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ ఆరోపణల గురించి తీవ్రంగా ఆందోళన చెందాడు. ఈ విషయాల గురించి దాదా తాజాగా గుర్తుచేసుకున్నాడు.

మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?
రాజ్‌ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నేను కెప్టెన్‌ అయ్యేకంటే ముందు భారత క్రికెట్‌ జట్టు చాలా సమస్యల్లో ఉంది. బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అసలు అవేంటో కూడా నాకు తెలియదు. నేను తరచూ సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ దగ్గరికి వెళ్లి వీటి గురించి అడిగేవాడిని.

‘అసలేం జరిగింది? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?’ అనే పదే పదే అడిగేవాడిని. ఎందుకంటే నన్నైతే ఎవరూ సంప్రదించలేదు. అందుకే ఇతరుల విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. సచిన్‌ దగ్గరికి వెళ్లి.. ‘నిన్ను ఎవరైనా (బుకీలు) అడిగారా’ అని ప్రశ్నించాను.

‘నో’ అనే సమాధానమే..
అందుకు ‘నో’ అనే సమాధానం వచ్చింది. ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే సైతం ఇదే మాట చెప్పారు. అప్పట్లో మేము టెస్టు, వన్డే ఫార్మాట్‌ మాత్రమే ఆడేవాళ్లము. కెప్టెన్‌గా నేను అప్పుడప్పుడే (2000) బాధ్యతలు చేపట్టాను. వీటితో పాటు మరో సమస్య కూడా ఉండేది.

అప్పుడు భయపడ్డా
సారథిగా నేను తొలి మ్యాచ్‌ కొచ్చిలో ఆడినట్లు గుర్తు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు డ్రెసింగ్‌రూమ్‌లో జట్టును ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. ఆ సమయంలో నా భార్య డోనాతో- ‘అజర్‌, సచిన్‌ కెప్టెన్సీలో ఆడినవాడిని. ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది’ అని చెప్పేవాడిని.

అందుకే ఆరోజు కేవలం 15 నిమిషాల్లోనే ప్రసంగం ముగించేశా. ఎక్కువగా మాట్లాడలేదు. ఆ మ్యాచ్‌లో మేము గెలిచాము. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎలా ఉండాలో నాకు అలవాటైంది. అంతా సర్దుకుంది’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. 

చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ

Advertisement
 
Advertisement
Advertisement