'క‌శ్మీరీ అని చుల‌క‌న‌.. అందుకే ఎంపిక చేయ‌లేదా?' | Auqib Nabi Not Selected For Team India Vs AFG Test Turns Political Heat Shameless | Sakshi
Sakshi News home page

'క‌శ్మీరీ అని చుల‌క‌న‌.. అందుకే ఎంపిక చేయ‌లేదా?'

May 20 2026 5:17 PM | Updated on May 20 2026 6:23 PM

Auqib Nabi Not Selected For Team India Vs AFG Test Turns Political Heat Shameless

ఐపీఎల్ 2026 సీజ‌న్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టు, వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ మంగ‌ళ‌వారం గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన టీమిండియాను ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ల‌తో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, మాన‌వ్ సుతార్‌, హ‌ర్ష్ దూబే, గుర్‌నూర్ బ్రార్ వంటి కొత్త ముఖాల‌కు బీసీసీఐ చోటు క‌ల్పించింది. 

అయితే దేశ‌వాలీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణించిన జ‌మ్మూ క‌శ్మీర్ క్రికెట‌ర్ అకిబ్ న‌బీని సెలెక్ట‌ర్లు ప‌ట్టించుకోకపోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2025-26 రంజీ సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహించిన అకిబ్ నబీ 10 మ్యాచ్‌ల్లోనే 60 వికెట్లు తీశాడు. తద్వారా ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో అకిబ్ నబీ కీలకపాత్ర పోషించాడు. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ అకిబ్ నబీని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై రాజ‌కీయ వివాదం అలుముకుంది. అకిబ్ న‌బీ క‌శ్మీర్‌కు చెందిన వ్య‌క్తి అన్న చుల‌క‌న భావంతోనే బీసీసీఐ అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయ‌లేదంటూ క‌శ్మీర్‌కు చెందిన రాజ‌కీయ నేత, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన‌ వ‌హీద్ ఉర్‌ రెహమాన్‌-ప‌రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

స్వ‌యానా దేశ ప్ర‌ధాని, ప్ర‌జ‌ల చేత శెభాష్ అనిపించుకున్న అకిబ్ న‌బీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న బీసీసీఐ క‌ళ్ల‌కు క‌నిపించ‌లేదా అంటూ వహీద్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు బీసీసీఐ అధ్య‌క్షుడు మిథున్ మ‌న్హాస్‌, ఐసీసీ చైర్మ‌న్ జై షాలు కూడ‌గ‌ట్టుకొని అకిబ్ న‌బీని జాతీయ జ‌ట్టుకు ఎంపిక కాకుండా అడ్డుప‌డ్డారంటూ 'ఎక్స్' వేదిక‌గా వారి పేర్ల‌ను ట్యాగ్ చేస్తూ విమ‌ర్శ‌ల‌కు దిగారు. 

'67 ఏళ్ల త‌ర్వాత జ‌మ్మూ క‌శ్మీర్ రంజీ ట్రోఫీ సాధించ‌డంలో అకిబ్ నబీది కీల‌క‌పాత్ర‌. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికైన అకిబ్ న‌బీని దేశ ప్ర‌ధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, క్రికెట్ అభిమానులు ప్ర‌శంసించారు. కానీ బీసీసీఐ మాత్రం కొన్ని శ‌క్తుల‌కు త‌లొగ్గి అకిబ్ న‌బీకి జాతీయ జ‌ట్టులో చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం బాధాక‌రం. మిథున్ మ‌న్హాస్‌, జై షాల నిర్ణయం చాలా షాకింగ్‌గా అనిపించింది' అని వహీద్‌ పరా ఘాటుగా రాసుకొచ్చారు.

ఇక అకిబ్ న‌బీ దేశ‌వాలీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. 29 ఏళ్ల అకిబ్ 2025-26 రంజీ సీజ‌న్‌లో జ‌మ్మూ క‌శ్మీర్‌కు ఆడాడు. 10 మ్యాచ్‌లాడిన అకిబ్ 17 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 12.56 స‌గ‌టుతో మొత్తం 60 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో ఏడు ఐదు వికెట్ల హాల్‌ను న‌మోదు చేయ‌డం విశేషం.

క‌ర్నాట‌క‌తో జ‌రిగిన రంజీ ఫైన‌ల్లోనూ అకిబ్ న‌బీ 54 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీయ‌డం ద్వారా జ‌మ్మూ క‌శ్మీర్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 291 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. దేశ‌వాలీ టోర్నీలో అద‌రగొట్టిన అకిబ్ న‌బీని ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచ్‌లాడిన అకిబ్ నబీ ఒక వికెట్ తీశాడు. 

జూన్ 6 నుంచి ఛండీగఢ్‌లోని ముల్ల‌న్ పూర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్టుకు భార‌త జ‌ట్టుకు గిల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అత‌డికి డిప్యుటీగా కేఎల్ రాహుల్ ఉండ‌నున్నాడు.

ఆఫ్గన్‌తో టెస్టుకు టీమిండియా: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్ (వైస్ కెప్టెన్‌) , సాయి సుదర్శన్, రిషభ్‌ పంత్, దేవదత్‌ పడిక్కల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్, గుర్‌నూర్‌ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్‌ జురేల్‌.

చదవండి: లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!

Advertisement
 
Advertisement
Advertisement