వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది.
సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే..
జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్‌దేవ్‌గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది.
శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు.
శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది.


