తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్‌ | UP Prayagraj Mother Heroic Sacrifice Saved Her Children From Massive Fire, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్‌

May 18 2026 9:20 AM | Updated on May 18 2026 9:39 AM

UP  Prayagraj Mother heroic sacrifice Viral Social Media

జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నగరంలోని నైనీ బజార్‌లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.

గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్‌ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్‌షీట్‌లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్‌ను కూడా రక్షించింది. 

అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement