కొత్త కబురు ఏమిటో? | PM Modi To Chair Special Cabinet Meeting Amid West Asia Tensions, Buzz Over Cabinet Expansion Grows, More Details Inside | Sakshi
Sakshi News home page

కొత్త కబురు ఏమిటో?

May 21 2026 6:56 AM | Updated on May 21 2026 8:56 AM

PM Modi council meeting : Cabinet Reshuffle Or Key Decisions News

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

మే 13న కేబినెట్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పొదుపు సూత్రాల నేపథ్యంలో జరిగిన ఆ భేటీలో కీలక ప్రకటనలు వెలువడొచ్చని అంతా భావించారు. కానీ, అలా జరగేలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటన తదనంతరం జరుగుతున్న భేటీ కావడంతో ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది. 

ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ ఆసియా ఘర్షణ, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. చమురు ధరలు, ఇంధన సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే నిశితంగా పర్యవేక్షణ చేస్తోంది. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్న ఉన్నత స్థాయి అనధికారిక మంత్రుల బృందం ఈ సంక్షోభాన్ని పరిశీలిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గించే చర్యలను సూచిస్తోంది. ఈ బృందంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. “చమురు, ఇంధనం, LPG నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు” అని ఇప్పటికే స్పష్టం చేసింది.

మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు
ఈ సమావేశానికి మరో రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. మోదీ 3.0 ప్రభుత్వం జూన్ 10న తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు జరిగే అవకాశాలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత వారం అధికార వర్గాలు కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని సంకేతాలు ఇచ్చాయి. మంత్రిత్వ శాఖల పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష జరుగుతోందని సమాచారం. రెండో వారంలోనే మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశం ఆర్థిక, రాజకీయ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం, చమురు ధరల పెరుగుదలపై చర్చలు జరగనున్నాయి. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఈ సమావేశం తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement