"నాకంటే చెడ్డవాడు ఎవరూ లేరు" | no one will be worse than me suvendu adhikari warns over attack | Sakshi
Sakshi News home page

"నాకంటే చెడ్డవాడు ఎవరూ లేరు"

May 18 2026 7:22 PM | Updated on May 18 2026 8:07 PM

 no one will be worse than me suvendu adhikari warns over attack

కోల్‌కతా : బెంగాల్ సీఎం సువేందు అధికారి అల్లరిమూకలపై రెచ్చిపోయారు.ప్రభుత్వ  ఆస్తుల ధ్వంసం, పోలీసు సిబ్బందిపై దాడుల పట్ల జీరో టాలరెన్స్ ప్రకటించారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే "నాకంటే చెడ్డవాడు ఎవడూ ఉండరు" అంటూ  అల్లరిమూకలకు మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. 

ఆదివారం కోల్‌కతాలోని పార్క్ సర్కస్-తిల్జాలా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై జరిగిన బుల్డోజర్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్‌పీఎఫ్  జవాన్లు గాయపడ్డారు. ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేశామని విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటనపై సీఎం సువేందు అధికారి స్పందించారు. "ఇలాంటి అ శాంతి, గూండాయిజం, దేశ వ్యతిరేక మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాల పట్ల జీరో టాలరెన్స్ ఉంటుందని నేను స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. ఇలాంటి వాటిని మేము కొనసాగనివ్వం. నేను గాయపడిన పోలీసు సిబ్బందిని, సీఆర్‌పీఎఫ్ జవాన్లను చూడటానికి, వారి గాయాల తీవ్రతను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నిన్న మన దళం మొత్తం శాంతిభద్రతలను కాపాడింది, పెద్ద ప్రమాదాన్ని నివారించి ప్రజలను రక్షించింది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను." అని అన్నారు.

సువేందు మాస్ వార్నింగ్

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని రౌడీయిజం చేస్తే అస్సలు సహించేది లేదని తనకంటే చెడ్డవారు ఎవరూ లేరని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పోలీసుల కాళ్లు, చేతులు కట్టవేసి పని చేయించే రోజులు లేవన్నారు. గతంలో పోలీసు బలగాలు పరిమితుల మధ్య పనిచేశాయని  పాత  నిబంధనలే ఇంకా కొనసాగుతాయని అనుకోవద్దు. " అని అన్నారు.

కశ్మీర్‌తో పోలిక

బెంగాల్ హింసపూర్వక ఘటనలను సువేందు కశ్మీర్‌ నిరసనలతో పోల్చారు. శ్రీనగర్, కాశ్మీర్‌లో పోలీసులపై రాళ్లు రువ్వడం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో కూడా ఇది ఆగుతుందని నేను నమ్ముతున్నాను.  అని సువేందు స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement