చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా? | Man rides scooter cross legged and hands free on Lucknow road | Sakshi
Sakshi News home page

చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా?

May 18 2026 8:14 PM | Updated on May 18 2026 8:48 PM

Man rides scooter cross legged and hands free on Lucknow road

లక్నో: స్కూటర్‌పై పద్మాసనం వేశాడు ఓ వ్యక్తి. హ్యాండిల్ వదిలేశాడు. రోడ్డుపై రైడింగ్ కాదు.. రిలాక్సింగ్ ఎక్సర్‌సైజ్‌ చేశాడు. స్కూటర్‌పై సన్యాసి పోజ్‌లో అతడు జనాలకు టెన్షన్ డోస్ పెంచేశాడు. అతడికి హెల్మెట్ లేదు.. భయం లేదు.. కామన్ సెన్స్ లేదు..

లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫన్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజీ రోడ్డుపై స్కూటర్ నడుస్తుండగానే ఆ వ్యక్తి బండిపై కాళ్లు మడిచి కూర్చున్నాడు. 

అలాగే హ్యాండిల్‌పై నుంచి రెండు చేతులూ తీసేసి, చుట్టూ వాహనాలు వెళ్తుండగానే ప్రయాణం కొనసాగించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేసినట్టు కనిపించింది. దీంతో స్కూటర్ ఒకే వేగంతో ముందుకు సాగింది. స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కనిపించలేదని సమాచారం.

ట్రాఫిక్ మధ్య అతడు ఈ విన్యాసం చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే వారి భద్రతకూ ప్రమాదం తెచ్చాడని మండిపడ్డారు. చాలామంది నెటిజన్లు లక్నో పోలీస్, యూపీ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నా, నిర్లక్ష్య డ్రైవింగ్, విన్యాసాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర తీరుకు ఎందుకు ఫుల్‌స్టాప్‌ పడడం లేదని చాలామంది ప్రశ్నించారు.

“నంబర్ లేని స్కూటర్, భద్రతా పరికరాలు లేవు, అసలు బాధ్యత అన్నదే లేదు. సోషల్‌ మీడియాలో గుర్తింపు కోసం తన ప్రాణాలనే కాదు, అమాయక ప్రయాణికుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాడు. లక్నో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కఠిన గుణపాఠం చెప్పాలి” అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.

మరో వ్యక్తి స్పందిస్తూ.. “ఇది చక్రాలపై యోగా లాంటిదే.. కానీ, రోడ్డు జాగ్రత్త మాత్రం లేదు. ఒక్క గుంతనో, ఒక్కసారిగా బ్రేక్ వేయడమో, లేదా ఇతర వాహనం ఎదురైతే అంతే సంగతి. అతడికే కాదు, ఇతరులకూ ప్రమాదం. ఇలాంటి విన్యాసాలు చూసి ఇంకొందరు నేర్చుకోకుండా ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement