రాష్ట్రానికి అదనంగా రూ.5 వేల కోట్లు ఇవ్వండి | Mallu Bhatti Vikramarka held a key meeting with Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి అదనంగా రూ.5 వేల కోట్లు ఇవ్వండి

May 21 2026 4:20 AM | Updated on May 21 2026 4:20 AM

Mallu Bhatti Vikramarka held a key meeting with Nirmala Sitharaman

ఎస్‌ఏఎస్‌సీఐ కింద అదనపు సాయం అందించండి 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి    

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విద్యారంగ రూపాంతరమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కీలక భేటీ జరిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల విస్తరణ, మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం నుంచి అదనపు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఆయన వినతిపత్రాలు సమర్పించారు. 

‘సాస్కీ’పథకం కింద.... 
రాష్ట్రంలో కొనసాగుతున్న మూలధన వ్యయాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా ‘సాస్కీ’(ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం 
కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి విక్రమార్క కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఇప్పటికే కేంద్రం రూ.4,208 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.30,000 కోట్లతో భారీ ప్రణాళికను రూపొందించిందని భట్టి పేర్కొన్నారు.  

ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయింపు ఇవ్వండి  
ఏడీబీ సహకారంతో రూ.4,049.11 కోట్లు, ఏఐఐబీ సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో చేపట్టే విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ రుణాలను రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ప్లానింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.  

కొయ్యగూడెం బ్లాక్‌–3ని సింగరేణికి అప్పగించండి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విజ్ఞప్తి 
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి సంస్థ భవిష్యత్‌ ప్రణాళికలు, రాష్ట్ర విద్యుత్‌ అవసరాలే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. కోల్‌ ఇండియా తరహాలోనే సింగరేణిలోనూ ఆధునిక సాంకేతికతతో ‘బొగ్గు గ్యాసిఫికేషన్‌’ప్రాజెక్టులను చేపట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు. 

తెలంగాణ విద్యుత్‌ అవసరాలకు కీలకమైన కొయ్యగూడెం బ్లాక్‌–3 గత వేలంలో కేటాయించినా నాలుగేళ్లుగా పనులు ప్రారంభం కాలేదని, కాబట్టి దాన్ని సింగరేణికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ–మైనింగ్‌ పనులు పూర్తయిన తాడిచెర్ల కోల్‌ బ్లాక్‌–2 మైనింగ్‌ లీజ్‌ ప్రక్రియను వేగవంతం చేసేలా ముందస్తు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. 

ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సింగరేణి సీఎండీ డాక్టర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement