కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇమామ్‌లు, ముయజ్జిన్‌లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన గుర్తింపుల ఆధారంగా సంక్షేమ పథకాలు ఉండకూడదని సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ ఒకటి నుండి మతపరమైన వర్గీకరణ ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖల ద్వారా ఈ పథకాలు అమలులో ఉన్నాయి. అవి వచ్చేలా మొదటి తేదీ నుంచి నిలిచిపోనున్నాయి.
2012లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇమామ్‌లకు నెలకు రూ. 2,500 గౌరవ వేతనం ప్రకటించింది. ఆ తర్వాత ముయజ్జిన్‌లకు కూడా ఆర్థిక సహాయం అందించారు. 2020లో హిందూ పూజారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే పథకం ప్రారంభమైంది. మొదట రూ.1,000గా నిర్ణయించిన ఈ వేతనం 2026 ఎన్నికల ముందు రూ.2,000కి పెంచారు.
అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మతపరమైన గుర్తింపులపై ఆధారపడకూడదని స్పష్టం చేసింది. అందుకే ఈ పథకాలను నిలిపివేస్తూ, కోటా అర్హతను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.
మమతా బెనర్జీ ప్రభుత్వ కాలంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలపై జరిగిన దాడుల కేసులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఒక నెలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది.


