సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
👉 పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్ నుంచి(ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది.
భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ..
దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.
👉హింట్ ఇస్తూ.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతీయడం.. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. సరిపడా నిల్వలు ఉన్నాయంటూనే.. పెంచక తప్పదనే చెబుతూ వచ్చింది. ఈలోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి, కార్‌పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే రూ.3 రూపాయల చొప్పున పెంపుతో సరిపెట్టాయి ఆయిల్ కంపెనీలు.
👉 సీఎన్‌జీ కూడా.. మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్‌జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్‌జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు.
👉 ప్రజలలో ఆందోళన.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం ఖాయం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపనుంది. సోషల్ మీడియాలో "ఇది తాత్కాలిక పెంపేనా? లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా?" అనే చర్చలు మొదలయ్యాయి.
👉 ఆర్థికవేత్తల అభిప్రాయం.. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. "ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది" అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త ధరలు
ఢిల్లీ: పెట్రోల్ ₹97.77, డీజిల్ ₹90.67
ముంబై: పెట్రోల్ ₹106.54, డీజిల్ ₹93.03
హైదరాబాద్: పెట్రోల్ ₹110.50, డీజిల్ ₹98.70
కోల్‌కతా: పెట్రోల్ ₹108.45, డీజిల్ ₹95.02
చెన్నై: పెట్రోల్ ₹103.80, డీజిల్ ₹95.39
బెంగళూరు: పెట్రోల్ ₹105.96, డీజిల్ ₹93.99
పాట్నా: పెట్రోల్ ₹108.54, డీజిల్ ₹94.78
జైపూర్: పెట్రోల్ ₹108.03, డీజిల్ ₹93.49
తిరువనంతపురం: పెట్రోల్ ₹110.38, డీజిల్ ₹99.26
చండీగఢ్: పెట్రోల్ ₹97.30, డీజిల్ ₹85.45
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.


