కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, విభాగాలు, ట్రిబ్యూనళ్లు, రెగ్యులేటరీల వంటి ప్రభుత్వ ప్యానెళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయ సలహాదారు, గవర్నమెంట్ ప్లీడర్, న్యాయాధికారి వంటి పోస్టుల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.
లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్ వేసిన ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులోని ప్యానెళ్లు మొదలు స్థానిక న్యాయసహాయక అథారిటీల్లో మహిళా న్యాయవాదులకు తగు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ విషయమై తాము ఇప్పటికే దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని తేల్చేందుకు సర్వే పూర్తిచేశామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్‌సింగ్ తెలిపారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇటీవల తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నన్ను కలిశారు. అక్కడ మహిళా లాయర్‌ను సెక్రటరీగా నియమించారని తెలిసి ఆశ్చర్యపోయా. అక్కడ మొత్తం 19,000 మంది బార్ సభ్యులున్నారని, వారిలో 8,000 మంది లాయర్లు తరచూ కోర్టులకు హాజరవుతారని తెలిసింది. వారిలో 2,000 మంది మహిళా లాయర్లే.
వీరిలో ఒకరికి మాత్రమే సెక్రటరీ పదవి దక్కింది’’ అని సీజేఐ గుర్తుచేశారు. మహిళా లాయర్లు న్యాయవాద వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలపై విడిగా పిల్ వేస్తామని సింగ్ తెలిపారు. ‘‘ లా కాలేజీల్లో చాలా మంది అమ్మాయిలు చేరి లా పట్టా పుచ్చుకుంటున్నా న్యాయస్థానాల దాకా రావట్లేదు. న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఎన్నో ప్రతిబంధకాలు వాళ్లకు అడ్డుగా నిలుస్తున్నాయి. అందుకే 30 శాతం రిజర్వేషన్ ద్వారా మహిళల ప్రాతినిధ్యం ఈ వృత్తిలో పెంచాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్యానెళ్లు, ప్రభుత్వ లా ఆఫీసర్ పదవులు, న్యాయ సహాయకులు, అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో లీగల్ నిపు ణులు,సలహాదారుల పదవుల్లోకి మహి ళా లాయర్లకు తగు అవకాశం ఇవ్వాలి’’ అని ఆయన వాదించారు.


